Pakistan: సింధూ నదీ జలాల ఒప్పందంపై పాకిస్థాన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ఈ అంశంపై కఠినంగా వ్యవహరించిన ఆ దేశం, ఇప్పుడు మాత్రం పరిణామాలను గమనించి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించేందుకు ముందుకు వచ్చింది. సింధూ జలాల ప్రాముఖ్యతను తెలుసుకున్న పాకిస్థాన్, ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల తలెత్తే తీవ్రమైన దుష్పరిణామాలను గుర్తించి, భారత్‌ను చర్చలకు ఆహ్వానించింది.
పాకిస్థాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ, భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు సమాచారం. భారత్ సింధూ జలాల సరఫరాను నిలిపితే తమ దేశంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లేఖలో పేర్కొంది. నిబంధనల ప్రకారం, ఈ లేఖను భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా పంపినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ విషయంలో భారత్ తన స్థిరమైన ధోరణిని ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలోనే ‘‘రక్తం, నీరు రెండూ ఒకేసారి ప్రవహించలేవు’’ అని పేర్కొంటూ పాకిస్థాన్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఉగ్రవాదం పూర్తిగా నిర్మూలించకపోతే ఎలాంటి చర్చలు జరగవని, జరుగుతే అవి కేవలం ఉగ్రవాద నిర్మూలన, పీవోకే వంటి అంశాలపై మాత్రమేనని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. సింధూ జలాల ఒప్పందంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పలుమార్లు స్పష్టం చేసింది.