Zakia Khanam: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ మయానా జకియా ఖానం బుధవారం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
వైసీపీకి, డిప్యూటీ ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేసిన వెంటనే విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన జకియా ఖానంను పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దుగ్గుబాటి పురందేశ్వరి ఘనంగా ఆహ్వానించారు. ఆమెకు కండువా కప్పి బీజేపీలోకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, “జకియా ఖానం బీజేపీలో చేరడం అభినందనీయం. ఆమె రాజకీయ అనుభవం పార్టీకి ఎంతో దోహదపడుతుంది,” అని పేర్కొన్నారు. అలాగే జకియా ఖానం రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆమె నిర్ణయాన్ని సమర్థించారన్నారు.
ఇది కూడా చదవండి: Yogi Adityanath: భారత్ లోకి చొరబడితే.. మీ అంత్యక్రియలకు కూడా ఎవరు ఉండరు
జకియా ఖానం మాట్లాడుతూ, “బీజేపీలో చేరడం నాకు సంతోషంగా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అందరికీ సమాన హక్కులు కల్పించేలా పాలన చేస్తున్నారు. ముస్లిం మహిళలకు భద్రత, గౌరవం కలిగించిన ఏకైక నాయకుడు మోదీయే. ముస్లిం మైనారిటీలకు సానుకూల సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను బీజేపీలో చేరాను,” అని స్పష్టం చేశారు.
అలాగే ప్రధాని మోదీ దేశానికి తండ్రిలా ఉన్నారని, ఆయన నాయకత్వంలో మైనారిటీలు సైతం అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని పేర్కొన్నారు.
ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందిన కీలక నేత బీజేపీలో చేరడం విశేషంగా భావిస్తున్నారు విశ్లేషకులు. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇది బీజేపీకి మైనారిటీల్లోకి అడుగుపెట్టే కీలక అడుగుగా భావించవచ్చు.