Kalvakuntla Kavitha: నా మీద కుట్రలు.. టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయటపెడతా.. మరోసారి కవిత సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీరు సంచలనంగా మారుతోంది. త్వరలో ఆమె సొంత పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం జోరందుకున్న వేళ, కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, నా మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్నీ బయటకు వస్తాయని కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కవిత, నేను పార్టీ బలోపేతం కోసమే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. 47 నియోజకవర్గాల్లో పర్యటనలో వచ్చిన అభిప్రాయాలనే చెప్తున్నానని, ఉన్న పరిస్థితుల ఆధారంగానే సామాజిక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించానన్నారు. పార్టీపై ప్రజల్లో రోజురోజుకూ నమ్మకం పెరుగుతోందని, ఈ సమయంలో నాపై ఈ రకమైన దుష్ప్రచారం సరికాదన్నారు. నేను ఆరు నెలలు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా నన్ను కష్టపెడతారా? అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నాపై జరుగుతున్న దుష్ప్రచారం విషయంలో పార్టీ స్పందిస్తుందనుకుంటున్నానని చెప్పారు.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం.. కీలక నిందితుడు అరెస్ట్
మే డే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ, భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్‌పై విమర్శలకు కారణమయ్యాయి. రాష్ట్రంలో గత పదేళ్లు అధికారంలో ఉన్నది మీ ప్రభుత్వమేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శించారు. దీంతో కవిత తీరుపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. కవిత వైఖరి చూస్తే, బీఆర్ఎస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ, తనను రెచ్చగొట్టవద్దని, అలా చేస్తే తాను మరింత గట్టిగా స్పందిస్తానని చెప్పడం వెనుక బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. నిజానికి గత కొంత కాలంగా కేసీఆర్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం గుప్పుమంటోంది. ఈ క్రమంలో తాజాగా తనను రెచ్చగొట్టవద్దని కవిత చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవనేది సస్పెన్స్‌గా మారింది.