Jagan: గోదావరి జిల్లాలు… ఏపీలో పొలిటికల్ డైనమిక్స్‌ని అర్థం చేసుకోవాలన్నా, ప్రజల నాడిని ఒడిసి పట్టుకోవాలన్నా ఈ జిల్లాలే కీలకం! ఇక్కడ గోదావరితో పాటు రాజకీయ చైతన్యం కూడా ఉప్పొంగుతుంది. గోదావరి అంగీకరిస్తే ఏ పార్టీ అయినా గద్దెనెక్కడం ఖాయం. తిరస్కరిస్తే రాజకీయ భవిష్యత్తు అంధకారం! ఈ జిల్లాలు గతంలో వైసీపీకి జైకొట్టినా, 2024లో మాత్రం ఘోర పరాజయం కట్టబెట్టాయి. అందుకే.. ఇప్పుడు జగన్ దృష్టి మళ్లీ గోదావరిపైనే! ఈ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేస్తూ, 2029లో అధికారమే లక్ష్యంగా.. జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం.
గోదావరి జిల్లాలు… ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శక్తి కేంద్రాలని చెప్పొచ్చు! ఈ జిల్లాలు ఏ పార్టీకి ఆమోదముద్ర వేస్తే, ఆ పార్టీ ఏపీలో అధికార పీఠాన్ని అధిరోహిస్తుంది. ఇది కేవలం నిన్నమొన్నటి కథ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచి గోదావరి జిల్లాలు రాజకీయ దిక్సూచిగా నిలిచాయి. 1983, 1985లో తెలుగుదేశం పార్టీకి జై కొట్టిన ఈ జిల్లాలు, 1989లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చాయి. 1994, 1999లో మళ్లీ టీడీపీని గెలిపించాయి. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో విభజన తర్వాత టీడీపీకి గోదావరి జిల్లాలు బలం చేకూర్చాయి. ఇక 2019లో వైసీపీకి గట్టి మద్దతిచ్చి జగన్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాయి. కానీ, 2024లో ఊహించని ట్విస్ట్! గోదావరి జిల్లాలు వైసీపీని పూర్తిగా తిరస్కరించి, ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఘోరంగా ఓడించాయి. ఇప్పుడు, ఓటమి తర్వాత ఏడాది గడుస్తున్నా, వైసీపీ గోదావరిలో తేరుకోలేకపోతోంది. ఎటు చూసినా కూటమి హవానే కనిపిస్తోంది. టీడీపీకి సహజ బలం, జనసేనకు ఒక శక్తివంతమైన సామాజిక వర్గం మద్దతు, బీజేపీ సైతం తన పట్టు పెంచుకుంటుండటంతో… వైసీపీ ఈ జిల్లాల్లో రాజకీయంగా బలహీనంగా మిగిలిపోయింది. 13 ఉమ్మడి జిల్లాల్లో.. వైసీపీకి అత్యంత బలహీనమైన ప్రాంతంగా గోదావరి జిల్లాలు నిలిచాయి.
గోదావరి జిల్లాల్లో వైసీపీకి సవాళ్లు ఒకటా రెండా? ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు. చాలా చోట్ల నాయకత్వం బలహీనంగా ఉంది, పార్టీలో మిగిలిన నేతలు కూడా సైలెంట్ అయ్యారు. ఫలితంగా, పార్టీ దిశా దశ అస్పష్టంగా మారింది. గోదావరిలో కాపు సామాజిక వర్గం రాజకీయంగా శక్తివంతంగా ఉంది. కానీ ఇది ప్రధానంగా జనసేన, టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది. బీసీలు టీడీపీకి గట్టి మద్దతుగా నిలుస్తున్నారు, అగ్రవర్ణ క్షత్రియులు బీజేపీకి ఆకర్షితులవుతున్నారు. ఎస్సీలు వైసీపీ వైపు ఉన్నప్పటికీ, ఈ ఒక్క వర్గం మద్దతు గోదావరిలో పార్టీని గట్టెక్కించలేకపోతోంది. ఈ సామాజిక సమీకరణాలు వైసీపీకి గోదావరిలో రాజకీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టాయి.
ఇది కూడా చదవండి: Operation Sindoor: చాలా స్పష్టమైన సందేశం… ప్రధాని ప్రసంగంపై AIMPLB ఏమి చెప్పింది అంటే ..?
వైసీపీ తిరిగి గోదావరిలో బలపడాలంటే, రాజకీయ వ్యూహాలను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. 2019లో బీసీలు, కాపులను ఆకర్షించినట్లుగా మళ్లీ వారిని సమీకరించాలంటే, కొత్త రాజకీయ శైలిని అవలంబించాలి. గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దృష్టి గోదావరి జిల్లాలపై కేంద్రీకృతమైంది. గోదావరిలో పార్టీని యాక్టివ్ చేస్తే, ఏపీలో మళ్లీ అధికారం సాధించే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే, గోదావరి జిల్లాల నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పీఏసీ సభ్యుడిగా నియమించడం ఈ వ్యూహంలో భాగమే.
ఇప్పుడు జగన్ వ్యూహం గోదావరి జిల్లాల చుట్టూనే తిరుగుతోంది. బీసీలను దగ్గర చేసుకునేందుకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించారు, ఎస్సీలను గౌరవించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, 2026 జూలై 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు వైసీపీ ఘనంగా ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ప్లీనరీకి గోదావరి జిల్లాలే సరైన వేదికగా భావిస్తున్నారు జగన్. గోదావరి ఒడ్డున నిలబడి, వైసీపీ తన రాజకీయ బలాన్ని ప్రత్యర్థులకు, రాష్ట్ర ప్రజలకు చాటాలని చూస్తోంది. ఈ ప్లీనరీ ద్వారా పార్టీ శక్తిని ప్రదర్శించి, 2029లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో జగన్ ముందుకు సాగుతున్నారు. త్వరలో జగన్ జిల్లాల పర్యటనలను కూడా గోదావరి నుంచే ప్రారంభించనున్నారని సమాచారం. గోదావరి జిల్లాల్లో వైసీపీ తిరిగి పుంజుకుంటుందా? ఈ రాజకీయ డ్రామాలో జగన్ వ్యూహం ఎంతవరకు సఫలమవుతుంది? సమయమే సమాధానం చెప్పాలి.