పుణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 198 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (86), టామ్ బ్లండెల్ (30 నాటౌట్) రాణించారు. వాషింగ్టన్ సుందర్ మరోసారి సత్తా చాటి 4 వికెట్లు తీశాడు. అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు.
156 పరుగులకు భారత్ ఆలౌట్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 156 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్‌కు 103 పరుగుల ఆధిక్యం దక్కింది. ఫస్ట్ టెస్టులో ఓడిన రోహిత్ సేన.. రెండో టెస్టులోనూ పేలవంగా ఆడింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై.. భారత టాప్ ఆర్డర్ ముప్పుతిప్పలు పడింది. 16 పరుగుల వద్ద ఇవాళ రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా.. కేవలం 140 రన్స్ జోడించి ఆలౌటైంది. లంచ్ టైంకు ఏడు వికెట్లకు 107 రన్స్ చేసిన ఇండియా.. ఆ తర్వాత 49 రన్స్ జోడించి మరో మూడు వికెట్లను కోల్పోయింది.
తొలిసారి అయిదు వికెట్లు
కివీస్ బౌలర్లలో స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు, గ్లెన్ ఫిలిప్స్ రెండు వికెట్లు తీయగా.. రైటార్మ్ పేసర్ టిమ్ సౌతీ ఒక వికెట్ దక్కించుకున్నాడు. సాంట్నర్ టెస్టుల్లో తొలిసారి అయిదు వికెట్లను తన ఖాతాలను వేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సాంట్నార్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు ఇబ్బందిపడ్డారు. ఈ టెస్టులో ఓటమి తప్పాలంటే బెంగళూరు టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగినట్టు భారత బ్యాటర్లు తమ తడాఖా చూపించాల్సిందే.

