Vishakapatnam: విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు ప్రణాళిక, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRC) టెండర్లను పిలిచింది. కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఈ రోజు విశాఖలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించబడింది.
ఈ సమావేశానికి దేశీయ, అంతర్జాతీయంగా 28 కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో 14 సంస్థలు ప్రత్యక్షంగా, 8 సంస్థలు ఆన్లైన్లో పాల్గొనడం గమనార్హం. టెండర్లను దాఖలు చేసేందుకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించగా, జూన్ 9న టెండర్లు తెరిచి కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయనున్నారు.
కన్సల్టెన్సీ ఎంపిక అనంతరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగంగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది. మొదటి దశ అమలుకు అంచనా వ్యయం రూ.11,498 కోట్లు కాగా, భూ సేకరణ కోసం అవసరమయ్యే 99.75 ఎకరాల కోసం రూ.882 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రాజెక్టు మొదటి దశలో మూడు మెట్రో కారిడార్లు నిర్మించనున్నారు. మొదటి కారిడార్ 46.23 కి.మీ., రెండవది 5.07 కి.మీ., మూడవది 6.75 కి.మీ. పొడవుండనున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యక్ష హామీ లభించనప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో ఉన్న సహకార సంబంధాలను నమ్ముకుని నిధుల కోసం చొరవ చూపనుంది. మొత్తం ఖర్చు భారాన్ని కేంద్రమే భరించాలని రాష్ట్రం భావిస్తోంది.
