Shivalik Sharma: రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనలో, మాజీ ఐపీఎల్ క్రికెటర్ శివాలిక్ శర్మపై ఒక యువతి అత్యాచారం ఆరోపణలు చేయడంతో, ఆయనను జోధ్‌పూర్ హౌసింగ్ బోర్డు పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. శివాలిక్ శర్మ గతంలో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమవగా, దేశవాళీ క్రికెట్లో బరోడా తరపున 50కి పైగా మ్యాచ్‌లు ఆడాడు.
బాధిత యువతి ఫిర్యాదు మేరకు, సోషల్ మీడియా ద్వారా శివాలిక్‌తో పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని తెలిపింది. ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నా, తర్వాత శివాలిక్ మోసం చేశాడని ఆమె ఆరోపిస్తోంది. శివాలిక్ పలుమార్లు జోధ్‌పూర్‌కు వచ్చి, తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని, అనంతరం ఆయన కుటుంబం సంబంధాన్ని రద్దు చేస్తూ మరో సంబంధం కోసం ప్రయత్నించడంతో తనపై మోసం జరిగినట్లు బాధితురాలు పేర్కొంది.
ఇది కూడా చదవండి: IPL 2025 Playoffs: ప్లే ఆఫ్స్ నుంచి దూరం వెళ్తున్న ఆర్సీబీ.. ఎందుకంటే..?
ఈ ఘటనపై స్పందించిన అట్లాద్ర పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హమీర్ సింగ్ భాటి, శనివారం నాడు వడోదరలో శివాలిక్ శర్మను అరెస్ట్ చేసి జోధ్‌పూర్ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. అతన్ని న్యాయహస్తంగా రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.
శివాలిక్ శర్మ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టులో ఎంపికయ్యాడు. రూ. 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసినప్పటికీ, ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం మాత్రం రాలేదు. దేశవాళీ స్థాయిలో బరోడా తరపున హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలతో కలిసి ఆడిన అనుభవం శివాలిక్‌కు ఉంది.
ప్రస్తుతం అతనిపై విచారణ కొనసాగుతోంది. క్రికెట్ ప్రపంచం నుంచి బయటపడిన ఈ ఘటనపై క్రికెట్ అభిమానులు, సామాజిక వర్గాలు విస్తృతంగా స్పందిస్తున్నాయి. ఈ కేసులో నిజానిజాలు ఏమిటన్నదానిపై కోర్టు విచారణ తరువాత స్పష్టత రావాల్సి ఉంది.