Warangal: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గీసుకొండ నుంచి మొగిలిచెర్లకు వెళ్లే రహదారిపై రైతులు 30 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న కంకులను ఎండలో ఆరబెట్టారు. రాత్రి ఓ రైతు చేనులో మొక్కజొన్న చొప్పను కాల్చేందుకు నిప్పుపెట్టగా.. ప్రమాదవశాత్తు అది దావానలంలా వ్యాపించింది. కొన్ని క్షణాల్లోనే పక్కనే ఉన్న చేలకు మంటలు అంటుకుని తీవ్రరూపం దాల్చాయి. భారీగా ఎగిసిపడిన అగ్నికీలలను అర్పేందుకు స్థానికులు యత్నించినా.. మంటలు అదుపులోకి రాలేదు. దీంతో వరంగల్ నుంచి రెండు ఫైరింజిన్లను రప్పించి మంటలను అదుపు చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
