CMO Prakshalana Start

CMO Prakshalana Start: సీఎంవోలో భారీ మార్పులు.. ఎందుకంటే?

CMO Prakshalana Start: తెలంగాణ సీఎంవోలో ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా సీఎం సెక్రెటరీ షానవాజ్ ఖాసీంను బదిలీ చేసి, ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, డ్రగ్ కంట్రోలర్ డీజీగా నియమించారు. ఇప్పటికే సీఎం సెక్రెటరీగా ఉన్న ఐఏఎస్ సంగీత సత్యనారాయణను హెల్త్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తోన్న చంద్రశేఖర్ రెడ్డిని చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమించనున్నారు. ఇప్పటికే సంబంధిత ఫైల్‌పై గవర్నర్ సంతకం చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, నూతన బాధ్యతలు చేపట్టనున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన శ్రీనివాస్ రాజ్ బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ డిప్యూటేషన్‌పై పనిచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఆయన డిప్యూటేషన్ పొడగించలేదు. దీంతో వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను సీఎం సలహాదారుడిగా నియమించారు. తాజాగా సీఎంవో ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమించారు. దీంతో సీఎం ఆఫీసు నుంచి ముగ్గురు అధికారులు బయటికి వెళ్తుండగా, ఒకరు కొత్త బాధ్యతలు తీసుకోనున్నారు. మొత్తం ఐదుగురు అధికారులతో తన ఆఫీసు కార్యకలాపాలను కొనసాగించాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, తన ఆఫీసులో పనిచేసే సెక్రెటరీల నియామకం విషయంలో సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సీఎంవోలో పనిచేసే అధికారుల సంఖ్య ఏడుకు చేరింది. ఎక్కువ మంది ఆఫీసర్ల వల్ల కొన్నిసార్లు ప్రయోజనం ఉన్నా, అధికంగా ఇబ్బందులే తలెత్తినట్లు విమర్శలు ఉన్నాయి. అలాగే, ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కొన్నిసార్లు సెక్రెటరీల మధ్య సమన్వయం లోపం ఏర్పడినట్లు టాక్. అందుకే సెక్రెటరీల సంఖ్యను కుదించాలని, అందులోనూ అనుభవం ఉన్న వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఎవరిని సీఎంవోలో కొనసాగించాలి? ఎవరిని బయటికి పంపించాలి? అనే అంశంపై పలుమార్లు ఆలోచించి, తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

Also Read: Rajagopal Reddy: రాజగోపాల్‌ రెడ్డి యూటర్న్‌ వెనుక మతలబ్ ఏంటి?

ఒక్క సీఎంవోనే కాదు, ప్రభుత్వంలో కీలక అధికారుల విషయంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎస్‌గా రామకృష్ణారావును నియమించగా, డీజీపీ మార్పుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. స్మితా సబర్వాల్‌కు చెక్ పెట్టి, జయేష్ రంజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇలా మరికొందరు ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల మార్పుకు రంగం సిద్ధమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan-Bunny: అల్లు-మెగా కుటుంబాలను కలిపిన కొణిదెల మార్క్‌ శంకర్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *