Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదాడితో పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ముష్కరుల కోసం భద్రతాదళాల వేట కొనసాగుతోంది. ఉగ్రవాదులు చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెర్రరిస్టులు దాడి చేసిన తమ ఆయుధాలను ఎక్కడ దాచారో NIA వెల్లడించింది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ లష్కరే తోయిబా, ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యం ఉన్నట్లు ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదులు బేతాబ్ లోయలో ఆయుధాలను దాచిపెట్టారు. ఇది సంఘటన జరిగిన ప్రదేశానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఆయుధాలను దాచడానికి ముందు ఉగ్రవాదులు క్షున్నంగా తనిఖీలు చేశారు. NIA దాదాపు 150 మంది వాంగ్మూలాలను నమోదు చేసింది.
అలాగే ఆ స్థలంలో దొరికిన ఖాళీ కాట్రిడ్జ్‌లను FSLకి పంపారు. ఈ కుట్ర మొత్తం లష్కరే ప్రధాన కార్యాలయంలోనే జరిగింది. ప్రాథమిక దర్యాప్తు నివేదికలో దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదలు హషీం మూసా, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ పీవోకేకు చెందినవారని విచారణలో తేలింది. పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తాన్ ఆ దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని వాదిస్తోంది. కానీ ఈ దాడి వెనుక ఉన్న కుట్ర మొత్తం పాకిస్తాన్‌లోనే జరిగిందని దర్యాప్తులో తేలింది.
కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడి జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది పర్యాటకులు మరణించారు. ఇందులో నేపాల్‌కు చెందిన ఒక పర్యాటకుడు కూడా ఉన్నాడు. పర్యాటకులను వారి మతం గురించి అడిగి.. వారు హిందువులే అని నిర్ధారించుకున్న తర్వాతే వారు హిందువులను చంపారు. టర్కిష్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) మొదట ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ తరువాత దానిని తిరస్కరించింది.


