TTD Chairman Simplicity: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య కేంద్రం. దీని పరిపాలనను పర్యవేక్షించే టీటీడీ చైర్మన్ పదవి అత్యున్నత గౌరవంగా భావించబడుతుంది. ఈ పదవి కోసం వందల కోట్లు విరాళంగా ఇచ్చేందుకు దేశంలోని పారిశ్రామికవేత్తలు, ఆస్తిపరులు ఎదురు చూస్తుంటారు. అలాంటి పదవి చిత్తూరు జిల్లా మారుమూల గ్రామంలో జన్మించిన బీఆర్ నాయుడుని వరించింది. మీడియా సంస్థ అధిపతిగా, అన్న ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ, అమరావతి రైతులతో కలిసి పోరాటం చేసిన నాయుడు, నీతి, నిజాయితీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపికగా 2024 నవంబరు 6న టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.
గతంలో చెంగల్ రెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి వారు టీటీడీ చైర్మన్లుగా రాజభోగాలను ఆస్వాదించారు. అయితే, బీఆర్ నాయుడు తొలి రోజే సౌకర్యాలను తిరస్కరించారు. భక్తుల కానుకలు భక్తుల సౌకర్యాలకే వినియోగించాలని, టీటీడీ నుంచి ఎలాంటి ప్రివిలేజెస్ అవసరం లేదని స్పష్టం చేశారు. ఐదు అధునాతన కార్లకు బదులు తన సొంత కారును ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలలో ఏసీ కార్యాలయాలను వద్దన్నారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 100 మంది సిబ్బందిని నియమించుకునే వెలుసుబాటు చైర్మన్‌కు ఉంటుంది. గతంలో చైర్మన్‌లు ఇలాగే చేసేవారు. కానీ నాయుడు.. తనకు అంత మంది అక్కర్లేదనీ, ఓ 10 మంది సిబ్బంది ఉంటే చాలన్నారు. భోజన ఖర్చులు, ఇతర వినియోగాలకు టీటీడీ నిధులను వాడకుండా, తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా టీటీడీ అధికారులు పంపిన 100 డైరీలు, మరో 100 క్యాలెండర్లను తిరస్కరించి, దేవుడి సొత్తును ఉచితంగా తీసుకోవడం తనకు నచ్చదని వెనక్కి పంపా రు.
బీఆర్ నాయుడు భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యమిచ్చారు. రోజుల తరబడి కంపార్ట్‌మెంట్‌లలో బంధించే దర్శన విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో గంటలోపు శ్రీవారి దర్శనం, దేశవ్యాప్తంగా స్వామివారి ఆలయాల నిర్మాణం, అన్న ప్రసాద భవనంలో నాణ్యమైన భోజనం, లడ్డు ప్రసాదాల నాణ్యత మెరుగుదల వంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పూల బొకేలు, శాలువాలు, సిఫార్సు లేఖలను నిషేధించి, వీఐపీలతో ఫోటోలు దిగడాన్ని తిరస్కరించారు. టికెట్ కోటాలో అనేక టికెట్లు మిగిలిపోతుండగా, సిఫార్సులకు తావులేకుండా స్వయం నియంత్రణ విధించారు. గత చైర్మన్‌ల క్యాంపు కార్యాలయాల వద్ద వీఐపీల రద్దీ కనిపించేది, కానీ నాయుడు వద్ద దళారులు, సిఫార్సుల ప్రసక్తే లేదు.
Also Read: WAVES Summit 2025: ముంబైలో వేవ్స్ సదస్సు ప్రారంభించిన మోదీ
TTD Chairman Simplicity: టీటీడీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని బీఆర్ నాయుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గోవుల సహజ మరణాలపై రాజకీయం చేయడం బాధాకరమని, గో సంరక్షణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీవారి సేవల్లో పాల్గొనే అవకాశాలను ఉన్నతాధికారులకు వదిలేసి, తాను భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించారు. శుక్రవారం అభిషేక సేవలో మొదటి భక్తుడిగా పాల్గొనే అవకాశాన్ని కూడా అధికారులకే అందించారు. అన్న ప్రసాద భవనంలో వడలు, నాణ్యమైన భోజనం వంటి సంస్కరణలతో భక్తుల సంతృప్తికి కృషి చేస్తున్నారు.
టీటీడీ బడ్జెట్ 5300 కోట్లతో ఒక చిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తలపిస్తుంది. ఇంతటి బాధ్యతను నిరాడంబరతతో నిర్వహిస్తున్న నాయుడు, రాజకీయ నాయకులు తిరుమలను రాజకీయాలకు ఉపయోగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులకు పవిత్ర క్షేత్రమైన తిరుమలను వివాదరహితంగా ఉంచుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్న నాయుడు.. తన మీడియా సంస్థ టీవీ5లో టీటీడీకి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం తాను చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టకముందే నిలిపివేశామని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ప్రతి ఒక్కరూ సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. దేశ ప్రముఖులతో పరిచయాలను, ఇతర ప్రయోజనాలకు వినియోగించుకునే అవకాశాన్ని పట్టించుకోకుండా, సామాన్య భక్తుల సౌకర్యాలను భగవంతుడి సేవగా భావిస్తూ ముందుకు సాగుతున్న బీఆర్ నాయుడు, టీటీడీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా ముద్ర వేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పరిశీలకులు, శ్రీవారి భక్తులు.

