బాన్సువాడ భానుమతిగా తెలుగు తెరకు పరిచయమై ఫిదా చేసిన నటీమణి సాయిపల్లవి. ముందు కథ విని.. నచ్చితేనే ఓకే చెబుతుందీ భామ. స్కిన్ షోకు ఆమడ దూరంలో ఉంటుంది సాయిపల్లవి. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అమరన్’. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది సాయి పల్లవి. తాను గ్లామరస్ పాత్రలు చేయకపోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందని చెప్పింది సాయిపల్లవి.
సినిమాల్లోకి రాకముందు వైద్య విద్య కోసం జార్జియా వెళ్లానని చెప్పింది. అక్కడ టాంగో డ్యాన్స్ నేర్చుకున్నాని తెలిపింది. డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా ఒక కాస్ట్యూమ్ ఉంటుందని.. సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్లో శిక్షణ తీసుకున్నానని చెప్పింది. కొంతకాలానికి ‘ప్రేమమ్’లో అవకాశం రావడంతో సినిమాల్లోకి అడుగుపెట్టానని గతాన్ని గుర్తుకు చేసుకుంది. ఆ సినిమా విడుదలయ్యాక.. టాంగో డ్యాన్స్ వీడియోను పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీనికి నెగెటివ్ కామెంట్లు వచ్చాయని చెప్పింది సాయిపల్లవి.
ఈ కామెంట్లు తనను బాగా బాధపెట్టాయని తెలిపింది. దీంతో గ్లామరస్ పాత్రలు చేయొద్దని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ‘అమరన్’ తెరకెక్కింది. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా నెల 31న విడుదల కానుంది.