CM Chandrababu: సింహాచలంలో ఇటీవల జరిగిన దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా స్పందించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సమీక్షించారు. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం ఆదేశించారు.
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ముఖ్యమంత్రి తీర్మానం తీసుకున్నారు. ఈ టెలికాన్ఫరెన్స్లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Simhachalam: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి.. 8 మంది భక్తుల మృతి
CM Chandrababu: ప్రమాదం ఎలా జరిగింది, బాధితులకు ప్రస్తుతం అందుతున్న వైద్యసేవలపై అధికారులను సీఎం వివరంగా ప్రశ్నించారు. సంఘటనపై పూర్తి నిజాలు వెలికి తీసేందుకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.
ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటన పట్ల రాష్ట్రవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుతున్నారు.
