Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మరో కొత్త భయం ఎదురవుతోంది. ఆలయ పరిసరాల్లో పాము హడావుడి భక్తుల్ని కలవరపెడుతోంది. తాజాగా తిరుమలలోని స్పెషల్ విఐపి కాటేజీలో ఓ నాగుపాము ప్రత్యక్షమవడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే… తిరుమల 14వ నంబర్ విఐపి కాటేజీలోని విశ్రాంతి గదిలో ఓ పెద్ద నాగుపాము కనిపించింది.అక్కడ ఉన్న భక్తులు వెంటనే గదిలో నుంచి బయటకు వచ్చి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు టిటిడి అటవీ శాఖను సంప్రదించగా, ఫారెస్ట్ ఉద్యోగి భాస్కర్ నాయుడు వచ్చి పామును సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేశారు. ఇది చూసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఒకటే కాదు – ఇటీవలి కాలంలో పాములు తరచూ కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు పెద్ద కొండచిలువలు, విషపూరిత పాములు కూడా దర్శనమిస్తున్నాయి.
Tirumala: వాతావరణ మార్పులు, అడవుల్లో నీరు లేకపోవడం వంటివి పాములను మనుషుల ప్రాంతాలకు దగ్గరగా చేస్తుంది. భక్తుల భద్రత కోసం టిటిడి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాములు కనిపించే ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీలు, స్నేక్ క్యాచర్ల బృందాలను మోహరించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సంఘటనలు తిరుమలకు వచ్చే భక్తులలో భయం కలిగిస్తున్నాయి. భక్తులు భద్రతగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.