Mohan bhagwat: భారతదేశపు సహజ స్వభావం అహింసే అని, దేశపు మూల్యాల్లో అది కీలకమైన భాగమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ అన్నారు. అయితే, హింసకు పాల్పడే వారిని బుద్ధి చెప్పడం కూడా సమానంగా అవసరమని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ రోజు ఢిల్లీలో జరిగిన ‘ది హిందూ మేనిఫెస్టో’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇతరులకు హాని చేయడం, ఇబ్బంది పెట్టడం, లేదా అవమానించడం మన సంస్కృతి కాదు” అన్నారు. ప్రజల రక్షణ పాలకుల ప్రాథమిక బాధ్యత అని, వారు ఆ బాధ్యతను నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు.
భగవత్ పౌరాణిక ఉదాహరణలు కూడా ప్రస్తావించారు. భగవద్గీత అహింసను ఉపదేశిస్తుందని చెప్పారు. అయితే, అదే గీత అర్జునుడిని ధర్మరక్షణ కోసం యుద్ధానికి ప్రేరేపించిందని గుర్తుచేశారు. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం అవసరమవుతుందని ఆయన వివరించారు. రామాయణంలో రావణుడి ఉదాహరణను చూపిస్తూ, రాముడు రావణుడిని ద్వేషంతో కాకుండా, రావణుని మేలు కోసమే సంహరించాడని పేర్కొన్నారు.
“అహింస మన స్వభావం, మన విలువ” అని భగవత్ స్పష్టంగా చెప్పారు. “మన ప్రవర్తన చూసి కొందరు మారతారు. కానీ మరికొందరు, ఎంత చెప్పినా మారరు. వారు ప్రపంచంలో కలహం, అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అని ఆయన వివరించారు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గానికి తేవడం అవసరమని భగవత్ నొక్కి చెప్పారు.