Delhi: పాక్ గగనతలాన్ని మూసివేత: భారత్ విమానయానంపై ప్రభావం

Delhi: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ పాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌ భారత్‌కు చెందిన విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామంతో విమానయాన రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుండి పశ్చిమ దేశాలకు వెళ్లే విమాన సేవలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

గగనతలం అందుబాటులో లేకపోవడం వల్ల విమానాలు ప్రత్యామ్నాయ, పొడవైన మార్గాల ద్వారా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణ దూరం, సమయం పెరిగే అవకాశముందని డీజీసీఏ హెచ్చరించింది. అదనపు ఇంధనం నింపుకోవాల్సి రావడం, సిబ్బందిని మార్పిడి చేయడం కోసం టెక్నికల్ స్టాప్‌లను తీసుకోవాల్సి వస్తుందని సూచించింది.

ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, సుదీర్ఘ ప్రయాణాలకు తగినట్లుగా విమానాల్లో అదనపు ఆహారం, పానీయాలు సిద్ధంగా ఉంచాలని సూచించింది. అలాగే అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ ప్రభావం ముఖ్యంగా ఢిల్లీ, అమృత్‌సర్‌ వంటి ఉత్తర భారతదేశ నగరాల నుంచి యూఏఈ, యూరప్, యూకే, ఉత్తర అమెరికా వంటి ప్రాంతాలకు నడిచే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్‌ విమానాలపై అధికంగా పడనుంది. ఈ విమానాలు ఇకపై ముంబయి, అహ్మదాబాద్ మీదుగా అరేబియా సముద్రం దాటి మస్కట్ దిశగా మళ్లాల్సి ఉంటుంది.

పైలట్ల ప్రకారం, ఈ మార్గంలో ఎదురుగాలులు ఎక్కువగా వీస్తాయని, అందువల్ల ప్రయాణ సమయం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో ఎయిర్‌లైన్ సంస్థలకు నిర్వహణ ఖర్చులు పెరిగే అవకాశముంది. అదనపు ఇంధనం, ల్యాండింగ్ ఛార్జీలు, సిబ్బంది వ్యయాలు పెరగనున్నాయి.

ప్రత్యేకించి సుదూర ప్రాంతాలకు సేవలు అందించే ఎయిర్ ఇండియాపై అదనపు భారం పడనుందని భావిస్తున్నారు. ప్రయాణ దూరం, సమయం పెరిగిన నేపథ్యంలో ఇండిగో కొన్ని అంతర్జాతీయ సేవలను తాత్కాలికంగా నిలిపివేసే నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా, టికెట్ ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఈ భారం ప్రయాణికులపై పడే అవకాశం ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *