Rajatosthava Gulabhi

Rajatosthava Gulabhi: రజతోత్సవ గులాబీ: అక్కున చేర్చుకున్న ఓరుగల్లు

Rajatosthava Gulabhi : గులాబీ పార్టీ రజతోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 27న ఎలుకతుర్తి వేదికగా లక్షలాది మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది. ఉద్యమ పార్టీగా రెండు దశాబ్దాలుగా ఓరుగల్లు ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంది. 2001 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భవించినప్పటికీ, 2004లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయగా, ఉమ్మడి వరంగల్ ప్రజలు ఉద్యమ పార్టీకి జైకొట్టారు. తొలి నుంచి గులాబీ పార్టీకి అండగా ఉన్న ఓరుగల్లు ఓటర్లు.. 2023లో మాత్రం ప్రతికూల తీర్పు ఇచ్చారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఓరుగల్లునే రజతోత్సవ వేడుకలకు కేంద్రంగా గులాబీ పార్టీ ఎంపిక చేసింది. ఇటీవలి ఓటముల నుంచి క్యాడర్ దృష్టి మళ్లించి, గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేలా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన టీఆర్ఎస్ ఓరుగల్లులో తనదైన ముద్ర వేసుకుంది. టీఆర్ఎస్ ఆవిర్భావంలో ఓరుగల్లుకు చెందిన ప్రొఫెసర్ జయశంకర్, గాదె ఇన్నయ్య, వి.ప్రకాష్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అదే ఏడాది జూలైలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో జనతా పార్టీ రైతు నాగలి గుర్తుపై తొలిసారి ఎన్నికల బరిలో దిగింది. భారీ స్థాయిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలను గులాబీ పార్టీ గెలుచుకుంది. ఆగస్టులో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా పట్టిన వారు అత్యధికం సర్పంచులుగా గెలిచారు. ఊరూరా ఉద్యమ కాంక్ష రగులుతుండగా, గులాబీ జెండా పట్టుకుని యువత లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించింది. స్వరాష్ట్రం కోసం టీఆర్ఎస్ పిలుపుతో అనేక వర్గాలు ఉద్యమాల్లో చేరాయి.

రాజకీయంగా బలంగా ఉన్నప్పుడే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించవచ్చని భావించిన కేసీఆర్, 2004లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని గులాబీ జెండా, కారు గుర్తుతో బరిలో దిగారు. తెలంగాణలో 56 స్థానాలకు పోటీ చేస్తే, 26 చోట్ల గెలిచారు. అందులో ఆరుగురు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారే. స్టేషన్ ఘనపూర్ నుంచి డాక్టర్ గుండె విజయరామారావు, చెన్నూరు నుంచి దుగ్యాల శ్రీనివాసరావు, చేర్యాల నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పరకాల నుంచి బండారి శారారాణి, నర్సంపేట నుంచి కంభంపాటి లక్ష్మారెడ్డి, హనుమకొండ నుంచి మందాడి సత్యనారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచారు. 13 అసెంబ్లీ స్థానాల్లో ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు, హనుమకొండ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్, వరంగల్ ఎంపీగా రవీంద్రనాయక్ గెలవడం ద్వారా ఓరుగల్లు గడ్డపై గులాబీ పార్టీ విజయం స్వరాష్ట్ర ఉద్యమానికి మరింత ఊపునిచ్చింది. కాంగ్రెస్ ఐదు, టీడీపీ రెండు స్థానాల్లో గెలిచాయి. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్ పాగా వేయడంతో వరంగల్ గులాబీ కోటగా మారింది.

Rajatosthava Gulabhi: టీఆర్ఎస్ ఆవిర్భావంతో కాంగ్రెస్, టీడీపీ నుంచి అనేకమంది గులాబీ పార్టీలో చేరారు. ఔత్సాహికులు కూడా గులాబీ గూటికి చేరారు. ఈ చేరికలతో పాటు చీలికలను టీఆర్ఎస్ ఎదుర్కొంది. ఎన్నికలైన నాలుగు నెలల్లోనే.. అంటే 2004 సెప్టెంబర్‌ 13న వైఎస్ఆర్ కేబినెట్ నుంచి టీఆర్ఎస్ బయటకు వచ్చింది. కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతుగా ఓరుగల్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు ఓటు వేశారు. కేసీఆర్ వారిపై చర్యలు తీసుకోవడంతో దుగ్యాల శ్రీనివాసరావు, కంభంపాటి లక్ష్మారెడ్డి, మందాడి సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీఆర్ఎస్ నిలదొక్కుకోవడం కష్టమనే చర్చ జరిగింది.

Also Read: Vishaka YCP Raju Evaru: జైలు కెళ్తాడని తెలిసినా..! విశాఖలో వైసీపీ దుస్థితి..

ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, 2014లో స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టింది. అనేకమందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. వరంగల్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన పసునూరి దయాకర్‌కు టీఆర్ఎస్ రాజకీయ జీవితాన్ని ఇచ్చింది. సామాన్య కార్యకర్తగా చేరిన దయాకర్ అనూహ్యంగా రెండుసార్లు ఎంపీగా గెలిచారు. న్యాయవాదిగా పనిచేస్తున్న బోయినపల్లి వినోద్ కుమార్ రెండుసార్లు హనుమకొండ ఎంపీగా విజయం సాధించారు. 2004లో వరంగల్ ఎంపీగా రవీంద్రనాయక్ టీఆర్ఎస్ నుంచి తొలిసారి గెలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి జెడ్పీ ఫ్లోర్ లీడర్‌గా, ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాస్యం వినయ్ భాస్కర్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి రెండుసార్లు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. ఆరూరి రమేష్, శంకర్ నాయక్, మాలోతు కవిత, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు గులాబీ జెండాతో రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్‌లో కీలకంగా ఎదిగారు.

Rajatosthava Gulabhi: వరుస ఓటములతో డీలా పడిన గులాబీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఈ నెల 27న నిర్వహించే రజతోత్సవ సభ దోహదపడుతుందని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా 12 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటులో ఓరుగల్లు ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి కడియం శ్రీహరి, మహబూబాబాద్ నుంచి ఆజ్మీరా సీతారాం నాయక్ ఎంపీలుగా గెలిచారు. భూపాలపల్లి నుంచి గెలిచిన సిరికొండ మధుసూధనాచారి శాసనసభ తొలి స్పీకర్‌గా పనిచేశారు. ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన చందులాల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పరకాల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి, పాలకుర్తి నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ గూటికి చేరారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. భూపాలపల్లి, ములుగులో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకరమణారెడ్డి ఆరు నెలలకే కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీలు, మెజారిటీ ఎంపీటీసీలు, సర్పంచులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

2023లో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా, ఓరుగల్లు ఓటర్లు గులాబీకి షాక్ ఇచ్చారు. 12 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల కాంగ్రెస్‌కు ఓటర్లు పట్టం కట్టారు. స్టేషన్ ఘనపూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. స్టేషన్ ఘనపూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి ఆరు నెలల్లో కాంగ్రెస్‌లో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను బీఆర్ఎస్ కోల్పోయింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి క్యాడర్‌ను నిరాశపరిచింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఎవరికీ మద్దతు ఇవ్వకపోవడం క్యాడర్‌లో అసంతృప్తిని కలిగించింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న బీఆర్ఎస్, క్యాడర్‌లో నూతనోత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తోంది. గ్రామస్థాయిలో పార్టీ చెక్కుచెదరలేదని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ వేదికగా ఈ నెల 27న రజతోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఉద్యమాల ఖిల్లాగా ఉన్న వరంగల్ నుంచి పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా అధిష్ఠానం ప్రణాళిక రూపొందిస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *