BRS 25 Years Drama Event: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో జరుగుతోంది. ఈ మేరకు పార్టీ నేతలంతా సిద్ధమవుతున్నారు. మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఏర్పాట్లలో వేగం పెంచారు. పార్టీ అధిష్టానం సైతం సభ ఏర్పాట్లపై దృష్టి సారించింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. సభను సక్సెస్ చేసేందుకు పదిహేను రోజులుగా రజతోత్సవ సభ ఆహ్వాన పత్రికలను అందజేస్తూ… ప్రతి ఒక్కరినీ బొట్టుపెట్టి మరీ సభకు ఆహ్వానిస్తున్నారు గులాబీ నేతలు.
భారత రాష్ట్ర సమితి పాతికేళ్ల పండుగ వేడుకలకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, చింతలపల్లి శివారులో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదిక కోసం, అలాగే సభకు హాజరయ్యే జనం కోసం చేస్తోన్న భారీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. భారీ జన సమీకరణ చేయనున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉద్యమ పార్టీగా అవతరించిన ఇప్పటి బీఆర్ఎస్, అప్పటి టీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గత పదిహేను రోజులుగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్ పూర్ గ్రామాల శివార్లలో 1213 ఎకరాలకు పైగా భూసేకరణ చేసారు. సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్ కోసమే కేటాయించారు.
తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి జనాలను తరలించే వాహనాల కోసం సుమారు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం హనుమకొండ ఎల్కతుర్తి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో సుమారు 400 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం హుజూరాబాద్, ఎల్కతుర్తి మార్గంలో సభకు సుమారు కిలోమీటర్ దూరంలో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ల సమీపంలో 200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
ఉమ్మడి మెదక్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ముల్కనూర్, ఎల్కతుర్తి మార్గంలో గోపాల్ పూర్ క్రాస్ రోడ్డుకి ఇరువైపులా 200 ఎకరాల పార్కింగ్ కేటాయించారు. దేవునూరు, ఉనికిచర్ల మీదుగా సభకు హాజరయ్యే జనగామ, స్టేషన్ ఘన్‌పూర్ నియోజక వర్గాల వారి కోసం కూడా పార్కింగ్ స్థలం ప్రత్యేకంగా కేటాయించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఉగ్రదాడిపై పవన్ కల్యాణ్ స్పందన.. కీలక నిర్ణయం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండుగ వేడుకలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, గులాబీ దళపతి కేసీఆర్ సభావేదిక ఏర్పాట్లను అన్నీ తానై పర్యవేక్షిస్తున్నారు. పతి రోజూ ఉదయం, సాయంత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సభా బాధ్యులు, ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. సభా వేదిక ఏర్పాట్లను అడిగి తెలుసుకోవడంతో పాటు పలు సూచనలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్యనేతలు సిరికొండ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కళ్లపెల్లి రవిందర్ రావులతో పాటు ఇతర జిల్లాలకు చెందిన బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేసి వెళ్లారు. రజతోత్సవ సభ ఇన్చార్జిలుగా నియమితులైన మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంత వరకు సభావేదికను సందర్శించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

