hyderabad: తెలుగు సంగీత అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన ‘పాడుతా తీయగా’ పాటల పోటీ కార్యక్రమం ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన మృతి తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ప్రముఖ గాయని సునీత, గీత రచయిత చంద్రబోస్‌లు ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సిరీస్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక అంశం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ షోలో పాల్గొన్న గాయని **ప్రవస్తి**, తన ఎలిమినేషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా షోపై సంచలన ఆరోపణలు చేశారు.
“రికమండేషన్ లేకపోతే అవకాశమే లేదు” – ప్రవస్తి
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఆమె స్పందిస్తూ, “పాడుతా తీయగా” వంటి షోల్లో పాల్గొనదలచిన గాయకులకు ఒకే సలహా – *జడ్జిల దగ్గర లేదా ప్రొడక్షన్ టీమ్ వద్ద పరిచయాలు లేకపోతే, ఎంటర్ అవ్వకండి. లేదంటే అన్యాయం, మానసిక వేదన తప్పదు*” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఎలిమినేషన్ తీరుపై స్పందించిన ప్రవస్తి, తనను తప్పుబడిన తీరు గురించి వివరించారు. ఆమె తెలిపిన ప్రకారం, జడ్జిలు తనను చిన్నచూపుతో చూశారని, తన శరీరంపై వ్యంగ్యాలు చేసినట్టు ఆరోపించారు. “నన్ను చీడపురుగులా చూస్తూ, బాడీపై జోక్స్ వేశారు. చెడు చూపులతో చూస్తూ వ్యాఖ్యలు చేశారు,” అని ఆమె వాపోయారు.
“ప్రొడక్షన్ టీమ్ వేధించింది” – తీవ్రమైన ఆరోపణలు
“తమిళంలో అనేక షోలు చేశాను. ఎక్కడా ఇలాంటి అనుభవం లేదు. కానీ జ్ఞాపిక ప్రొడక్షన్స్ ఈ షోకు వచ్చాక పరిస్థితి మారిపోయింది. వారు మిమ్మల్ని ఎక్స్‌పోజింగ్ చేయమంటారు. చీరలకూ బడ్డు కింద కట్టుకోవాలని ఒత్తిడి చేస్తారు. కాస్ట్యూమ్ డిజైనర్ ‘ఇలాంటి బాడీకి ఏం బట్టలు వేయాలో?’ అంటూ బాడీ షేమింగ్‌కు పాల్పడ్డాడు” అంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది ప్రవస్తి.
తన వ్యాఖ్యలపై ఫేక్ అకౌంట్ల ద్వారా వేధింపులు ఎదురవుతున్నట్టు పేర్కొన్న ఆమె, “దమ్ముంటే నీ అసలైన అకౌంట్ నుంచి మెసేజ్ చెయ్యి. ఫేక్ అకౌంట్ల వెనక దాగిపోవడం అవసరమా?” అంటూ మండిపడ్డారు.
ఇక ఈ ఆరోపణలపై షో నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

