bengaluru: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య జరిగే సమయంలో కుటుంబంలో భోజన సమయంలో వాగ్వాదం జరిగినట్టు సమాచారం.
ఓం ప్రకాశ్ కుమారుడు కార్తికేష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు తన తల్లి పల్లవి, సోదరి కృతి కారణమై ఉండవచ్చని కార్తికేష్ అనుమానం వ్యక్తం చేశాడు. వారు ఇద్దరూ గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడుతూ, తరచూ ఓం ప్రకాశ్‌తో గొడవ పడేవారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కార్తికేష్ వివరాల ప్రకారం, ఓం ప్రకాశ్ గత వారం తన సోదరి సరితా కుమారి ఇంట్లో ఉన్నారు. తన తల్లి నుంచి ప్రాణహాని ఉందని భావించి అక్కడికి వెళ్లారట. అయితే శుక్రవారం రోజు కృతి వెళ్లి ఆయనను తిరిగి ఇంటికి తీసుకొచ్చిందని కార్తికేష్ తెలిపాడు.
ఆదివారం మధ్యాహ్నం ఓం ప్రకాశ్ హత్య జరిగిన విషయాన్ని పొరుగువారి ద్వారా తెలుసుకున్న కార్తికేష్, ఇంటికి వెళ్లి చూడగా కత్తులు, పగిలిన సీసాల్ని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు అదే రోజు సాయంత్రం పల్లవిని అదుపులోకి తీసుకోగా, సోమవారం కృతిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ విచారిస్తూ, మరిన్ని వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ కేసును సౌత్ ఈస్ట్ డీసీపీ సారా ఫాతిమా పర్యవేక్షిస్తున్నారు.