Crime News: బెంగళూరు నగరంలోని హైక్లాస్ కాలనీలో జరిగిన ఓ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రాన్నే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రాష్ట్ర మాజీ డీజీపీ ఓం ప్రకాష్ (వయస్సు 68) తన సొంత నివాసంలోనే హత్యకు గురవడం శాకింగ్ అంశంగా మారింది. ఈ హత్య కేసులో పోలీసులు తవ్వితే తవ్వితే కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఈ దారుణానికి తెరలేపిందెవరో తెలుసుకున్నాక అందరూ షాక్‌కు గురయ్యారు. ముమ్మాటికీ ఇది హత్యే కాని సాధారణ గొడవ కాదని వారు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే — ఓం ప్రకాష్‌ను చంపింది ఆయన భార్య పల్లవి, ఆమె కుమార్తె కృతి కలిసి. ఇది కేవలం హత్య కాదు.. పూర్తిగా పథకం ప్రకారం జరిగిన దాడి.
కళ్లల్లో కారం, చేతులు కాళ్లు కట్టేసి, చివరికి కత్తిపోట్లు!
పల్లవి, కృతి కలిసి ఓం ప్రకాష్‌పై విచక్షణలేని విధంగా దాడి చేశారు. అతని కళ్లల్లో కారం పోసి, చేతులు కాళ్లు కట్టేసి, పలుమార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు.. గాజు సీసాతో కూడా దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ హత్య అనంతరం పల్లవి ఈ విషయం మరో పోలీస్ అధికారి భార్యకు చెప్పినట్లు తెలుస్తోంది, ఆ ఆధారంగా పోలీసులు కేసు మరింత లోతుగా పరిశీలిస్తున్నారు.
ఆస్తి వివాదమే ఘోరానికి దారి
పోలీసుల వివరాల ప్రకారం, ఓం ప్రకాష్ తన ఆస్తిని కుటుంబ సభ్యులకు కాకుండా బంధువుకు రాసిచ్చాడు. ఇదే విషయమే భార్యా-భర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆస్తిని కోల్పోతామన్న కోపంతో పల్లవి సుదీర్ఘంగా స్కెచ్ వేసి, కూతురితో కలిసి ఈ దారుణానికి తెరలేపిందని అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: West Bengal: పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తారా?
తనను చంపుతానంటూ బెదిరింపులు – వాదన కూతురు వెర్షన్
పల్లవి వాంగ్మూలం ప్రకారం.. ఓం ప్రకాష్ ఇటీవల తనపై ఒత్తిడి పెంచాడని, తుపాకీ పట్టుకుని ఇంట్లో బెదిరిస్తున్నాడని చెబుతోంది. కూతురు కృతి అయితే.. “తండ్రి మమ్మల్ని చంపుతాడనే భయంతోనే తల్లితో కలిసి ప్రతిఘటించాం” అని చెబుతోంది. ఇది పూర్తిగా తన ప్రాణాలు కాపాడుకునే క్రమంలో జరిగిన చర్య అని ఆమె వాదిస్తోంది.
ప్రస్తుతం పరిస్థితి..?
ప్రస్తుతం పల్లవి, కృతి ఇద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసులో మరింత స్పష్టత రావడానికి వారిని 12 గంటలపాటు ప్రశ్నించినట్లు సమాచారం. ఓం ప్రకాష్ కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ కలహాలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.