Arrest Time Very Soon: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 14 ఏళ్లుగా కొన..సా…..గుతున్న మనీలాండరింగ్ కేసులో మళ్లీ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసి, క్విడ్ ప్రో కో ద్వారా జగన్ కంపెనీలకు లాభాలు కల్పించారన్నది ఆరోపణ. ఈ కేసులో 800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేసింది. 2012లో సీబీఐ చేతిలో అరెస్టు అయిన జగన్, 16 నెలలు చంచల్‌గూడ జైలులో గడిపారు. 2013 నుంచి బెయిల్‌పై ఉన్న ఆయన, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందారు. అతన్ని అలా వదిలేశారేంటి? అంటూ ప్రస్తత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు.. వైసీపీ ఎంపీగా కొనసాగుతున్నప్పుడే సుప్రీంకోర్టు మెట్లెక్కారు. రఘురామ డిమాండ్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. రోజువారీ విచారణ చేయాల్సిందేనని ఆదేశించడంతో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా హైదరాబాద్, బెంగళూరులో పలు ఆస్తులు, డాల్మియా సిమెంట్స్‌కు సంబంధించి 793 కోట్ల ఆస్తులు జప్తయ్యాయి. ఈ కేసు జగన్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోంది.
ఇక లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. సిట్ అధికారులు మిథున్ రెడ్డితో పాటు కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి, ఆయన తండ్రికి నోటీసులు జారీ చేశారు. అయితే రాజ్ కసిరెడ్డి సెల్ ఫోన్లు మారుస్తూ తప్పించుకుని తిరుగుతున్నాడు. జగన్ హయాంలో మద్యం ఉత్పత్తిదారుల నుంచి కమీషన్లు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలతో సదరు ఉత్పత్తిదారులను కూడా విచారించింది సిట్. అయితే ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి విచారణకు ముందు కోర్టును ఆశ్రయించి, న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరగాలని కోర్టు అనుమతి తెచ్చుకున్నారు. అయితే, విచారణకు సంబంధించి ఆడియో-వీడియో రికార్డింగ్ కూడా చేయాల్సిందేనని మిథున్‌రెడ్డి పట్టుబట్టగా.. అంత సీన్ అక్కర్లేదని కోర్టు తిరస్కరించింది. సిట్ కార్యాలయంలో సీసీటీవీ పరిధిలో విచారణ జరిగితే చాలని ఆదేశించింది. కీలక వివరాలు రాబట్టేందుకు సిట్.. మద్యం వ్యాపారులతో కలిపి మిథున్ రెడ్డిని ప్రశ్నించనుంది. ఈ కేసు మిథున్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విచారణ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఊచలు లెక్కబెట్టేందుకు అతి చేరువలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. రంపచోడవరంలో అనంతబాబు అక్రమాలన్నీ తెలిసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు వద్ద పని మానేయడంతో… అతన్ని గెస్ట్ హౌస్‌కు పిలిపించి క్రూరంగా దాడి చేసి చంపారన్నది సింపుల్‌గా ఈ కేసు సారాంశం. మృతదేహాన్ని సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద పడేసి… పదివేలిస్తా పండగ చేస్కోండి అన్నారట మదమెక్కిన అనంతబాబు. అప్పట్లో దళిత సంఘాల ఫిర్యాదుతో అనంతబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆయన హత్య చేసినట్లు అంగీకరించినట్లుగా కూడా అప్పట్లో ఎస్పీ వెల్లడించారు.
Also Read: Jogulamba Gadwal: గద్వాల కాంగ్రెస్‌లో భగ్గుమన్న శ్రేణులు.. చితకబాదిన పోలీసులు
Arrest Time Very Soon: అయితే, అప్పటి సీఎం జగన్ రెడ్డి అండతో బెయిల్ తెచ్చుకుని… అప్పటి నుండి రెండేళ్లుగా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు అనంతబాబు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు బాధితుల తరఫున న్యాయవాదిగా నియమితులయ్యారు. దళిత సంఘాలు ఈ హత్యను కేవలం హత్యగానే చూడకూడదనీ, దళిత సమాజంపై జరిగిన క్రూరమైన దాడిగా భావించాలని, అనంతబాబుతో సహా.. 11 మంది సహ నిందితులపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. హత్య చేశానని స్వయంగా ఒప్పుకుని, శరం లేకుండా పెద్దల సభకు హాజరవుతున్న అనంతబాబుకు ఈ కేసులో శిక్ష ఖాయమని చర్చ జరుగుతోంది.
ఇక తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో గోవుల మృతిపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వేస్తున్న వీధి నాటకాలు రసవత్తరంగా ఉంటున్నాయి. గోశాలను “గోవధ శాల”గా అభివర్ణించి, మూడు నెలల్లో 100 గోవులు చనిపోయాయని పొంతన లేని ఫొటోలను పట్టుకొచ్చి, రచ్చ చేయడం మొదలు పెట్టారు భూమన. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ ఆరోపణలను అసత్యమంటూ ఖండించి, ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూమనపై బీఎన్ఎస్ యాక్ట్, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేశారని భానుప్రకాష్ ఆరోపించారు. గోవులు సహజంగా చనిపోయినా, దాన్ని తప్పుగా చిత్రీకరించారని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆరోపణలు మరొకరు చేయకుండా.. కఠిన చర్యలు తీసుకునే చాన్స్ ఉంది. ఈ కేసు భూమన రాజకీయ ఇమేజ్ను శాశ్వతంగా పాతి పెట్టొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
