Pawan Kalyan: ఏ అంశంలో అయినా సరే.. పవన్ రంగంలోకి దిగితే ఏమౌతుందో వైసీపీకి బాగా తెలుసు. వైసీపీ ఆటలు ఇంక సాగే పరిస్థితి ఉండదు. ఇంతకీ గత నాలుగైదు రోజులుగా తిరుమల గోశాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ఏంటి? వైసీపీ నేతల నోర్లు మూయించేందుకు నేరుగా పవన్ కళ్యాణే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఆ పార్టీయే కల్పించిందా? ఈ వివాదంలోకి పవన్ ఎంట్రీతో, గోశాలకి ఆయన స్వయంగా వెళ్తుండటంతో.. ఇక వైసీపీ దుష్ప్రచారానికి తెరపడినట్లేనా? గోశాల సందర్శనతో పవన్ ఏ సందేశం ఇవ్వనున్నారు? వైసీపీ మత విద్వేష ఆరోపణలకు ఈ పర్యటన సమాధానం అవుతుందా? పవన్ గోశాల సందర్శనతో వివాదం వెనుక వాస్తవాలు బయటపడబోతున్నాయా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
టీటీడీ గోశాలపై వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి నిరాధారంగా చేస్తోన్న ప్రచారం శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది. గతంలో స్వయంగా టీటీడీకి చైర్మన్‌గా చేసిన భూమన.. ఇప్పుడు తన రాజకీయం, తన కుమారుడి రాజకీయం కోసం తిరుమలను, హిందువులు గోమాతగా పూజించుకునే గోవులను ఎంచుకున్నట్లున్నారు. గత మూడు నెలల్లో వందకు పైగా ఆవులు తిరుమల గోశాలలో మృత్యువాత పడ్డాయని, భూమనతో పాటూ వైసీపీ చేస్తోన్న ఆరోపణల్ని టీటీడీ చైర్మన్, ఈవోలు ఖండించారు.
రాజకీయం కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించొద్దని కూటమి ప్రభుత్వం సైతం తీవ్రంగానే స్పందించింది. అయినా వైసీపీలో మార్పు రాకపోగా.. భూమన లాంటి వ్యక్తులు మరింతగా పేట్రేగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ ఆరోపణలకు చెక్ పెట్టాలని సంకల్పించారు. శుక్రవారం తిరుపతి పర్యటనకు వెళ్లనున్న పవన్.. అక్కడి గోశాలను స్వయంగా పరిశీలిస్తారు. పవన్ పర్యటన శ్రీవారి భక్తుల మనోభావాలను కాపాడటంతోపాటు, రాజకీయంగా కూడా కీలకం కానుంది.
ఇది కూడా చదవండి: Nara Lokesh: వాట్సాప్ ప్రభుత్వం.. రెండున్నర నెలల్లోనే విజయవంతం
గత నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకుడు, మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుమల గోశాలలో మూడు నెలల్లో 100 గోవులు చనిపోయాయని, ఫేక్ ఫోటోలతో సహా దుష్ప్రచారం చేశారు. ఈ ఆరోపణలు శ్రీవారి భక్తుల్లో అశాంతిని రేకెత్తించాయి. టీటీడీ తీవ్రంగా స్పందిస్తూ, వైసీపీ హయాంలో గోశాల నిర్వహణలో జరిగిన అవకతవకలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజల ముందు ఉంచింది.
భూమన మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల గోశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు. గోవుల పట్ల ప్రత్యేక అభిమానం కలిగిన పవన్, తన ఫామ్‌హౌస్‌లో గోవులను సంరక్షిస్తూ ఉంటారు. గోశాల సందర్శన ద్వారా వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించి, గోశాల నిర్వహణలో పారదర్శకతను నిరూపించాలని ఆయన భావిస్తున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి గోశాల వివాదంతోపాటు, తిరుమల సంప్రదాయాలపై పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో పాపవినాశనం రిజర్వాయర్‌లో బోటింగ్ వివాదంలో కూడా ఆయన టీటీడీని లక్ష్యంగా చేసుకున్నారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలు, నిర్వహణ లోపాలు వంటి అంశాలను కూటమి ప్రభుత్వం బయటపెట్టడంతో, వైసీపీ రక్షణాత్మకంగా ఈ దుష్ప్రచారానికి పాల్పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. టీటీడీ మరియు కూటమి ప్రభుత్వం భూమనపై చట్టపరమైన చర్యలతోపాటు, గోశాల నిర్వహణ వివరాలను పారదర్శకంగా వెల్లడించాయి.
ఈ వివాదం వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇక పవన్ కల్యాణ్ గోశాల సందర్శన ద్వారా వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టడమే కాక, తిరుమల సంప్రదాయాల పట్ల తన నిబద్ధతను చాటనున్నారు. ఆయన ఈ సందర్భంలో వైసీపీ మత విద్వేష రాజకీయాలపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఈ పర్యటన శ్రీవారి భక్తుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించి, వివాదానికి తెర దించే అవకాశం కనడుతోంది. కూటమి ప్రభుత్వం గోశాల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలను మరింత బలోపేతం చేసేందుకు ఈ సందర్శన కీలకం కానుంది.
తిరుమల గోశాల వివాదం వైసీపీ రాజకీయ వ్యూహంగా మొదలై, పవన్ కల్యాణ్ ఎంట్రీతో కీలక మలుపు తిరిగింది. ఆయన గోశాల సందర్శన, శ్రీవారి దర్శనం ద్వారా వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పెట్టి, తిరుమల పవిత్రతను కాపాడే దిశగా అడుగులు వేయనున్నారు. దీంతో ఈ వివాదం వైసీపీకి రాజకీయంగా భారీ ఎదురుదెబ్బగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.