Mudragada Padmanabham: పద్మనాభరెడ్డిగా మారిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం, మళ్లీ వైసీపీ రంగస్థలంపై స్టెప్పులేసేందుకు రెడీ అంటున్నారు. పేరు మార్చి, వైసీపీ పీఏసీలో సీటు సంపాయించి, జగన్‌ను సీఎం చేస్తానని శపథం చేశారు. ఆ వెంటనే కిర్లంపూడిలో అభిమానుల కేకలు, తాడేపల్లిలో జగన్ క్లాప్‌లు! కానీ, సజ్జల సామ్రాజ్యంలో ముద్రగడ సలహాలు ఎవరు పట్టించుకుంటారు? పిఠాపురంలో పవన్ చేతిలో షాక్ తిన్న ముద్రగడ, ఇప్పుడు కాపు ఓట్లతో వైసీపీకి జోష్ ఇస్తారా? ఈ రాజకీయ డ్రామా హిట్టవుతుందా, లేక పాత సినిమానే రీ రన్ అవుతుందా? అన్న చర్చ నడుస్తోంది.
జగన్‌మోహన్‌రెడ్డి వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటిచ్చారనగానే… ముద్రగడ ఆనందంగా జగన్‌కు లేఖ రాసి, “ఈ బాధ్యతతో పార్టీని అధికారంలోకి తెస్తా”నని శపథం చేశారు. చివర్లో ‘పద్మనాభరెడ్డి’ అని సంతకం కూడా చేశారు. అసలు ఈ పేరు మార్పు కథే… తీస్తే ఓ సినిమా అవుతుంది. మొన్నటిదాకా ముద్రగడ అంటే… కాపు ఉద్యమంతో గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఫైర్‌బ్రాండ్ లీడర్. రిజర్వేషన్ల కోసం దశాబ్దాలపాటు పోరాడి, తెలుగుదేశం, కాంగ్రెస్‌లలో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా చక్రం తిప్పిన ఆయన, ఇప్పుడు వైసీపీలో జగన్ బాటలో నడుస్తున్నారు. 2024 ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడిస్తానని తొడగొట్టి చెప్పిన ముద్రగడ, “పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటా” అని సవాల్ విసిరారు. ఫలితం? పవన్ 70,000 మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టారు. ముద్రగడ ఆత్మాభిమానం మెయింటైన్ చేస్తూ, ప్రభుత్వానికి అప్లై చేసి మరీ… అధికారికంగా ‘పద్మనాభరెడ్డి’ అయిపోయారు. సోషల్ మీడియా నెటిజన్లు మాత్రం, “పేరు మార్చారు కానీ, రాజకీయ లెక్కలు మారతాయా?” అంటూ కామెడీ కామెంట్లు చేశారు.
ఇక వైసీపీలో పీఏసీ కమిటీ అంటే ఏమిటో ఎవరికీ సరిగ్గా అర్థం కాదు. 30 మంది సీనియర్ నేతలతో కూడిన ఈ కమిటీకి సజ్జల రామకృష్ణారెడ్డి బాస్ అట. సజ్జల అంటే వైసీపీలో సకల శాఖలకు సూపర్ బాస్ అన్న పేరుంది. ఆయన ఉండగా ముద్రగడ సలహాలు ఎవరు పట్టించుకుంటారు? సజ్జల గారి స్క్రిప్ట్‌లోనే అంతా నడవాల్సి ఉంటుంది. మరేమో ఇటు ముద్రగడను చూసుకుంటే.. ఇగో ఆయన చుట్టూ వైఫైలా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యా సమన్వయం సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయ్. అయినా, ముద్రగడ ఇవేవీ పట్టించుకోకుండా… “జగన్‌ను మళ్లీ సీఎం చేసే బాధ్యత నాది” అంటున్నారు.
Also Read: Ponnam Prabhakar: తెలంగాణలో ప్రతిస్ఠాత్మకంగా కుల గణన
Mudragada Padmanabham: గతంలో కాపు ఓట్లను వైసీపీకి మళ్లించాలని ముద్రగడ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు పీఏసీలో స్థానంతో ఆయన మళ్లీ ట్రై చేస్తున్నారు. వైసీపీలో ప్రస్తుతం కీలక నేతలంతా ఒక్కొక్కరూ తలో దిక్కు వెళ్తుంటే, కేసుల భయంతో కొందరు సైలెంట్‌గా ఉంటున్న నేపథ్యంలో… ముద్రగడ ఒక్కరే ఈ హైడ్రామాలో హీరోలా కనిపిస్తున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురాకపోతే… ఇంకో పేరు మార్చుకుంటానని ఆయన అనలేదు కానీ… ఆయన జోష్ చూస్తే అలాంటి సవాల్ కూడా వస్తుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు. మొత్తంగా, ముద్రగడ కొత్త ఇన్నింగ్స్ వైసీపీకి ఊపు తెస్తుందా, లేక పాత రికార్డులనే రిపీట్ చేస్తుందా అనేది చూడాలి.

