Anakapalli : అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ బాణసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
పేలుడు జరిగే సమయంలో పరిశ్రమలో సుమారు 15 మంది ఉన్నారు. తారాజువ్వల తయారీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కర్మాగార భవనం పూర్తిగా కూలిపోయింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమి సాలీ మాట్లాడుతూ, పరిశ్రమలోని అగ్నిప్రమాద కారణాలు తెలుసుకోవడానికి విచారణ ప్రారంభించామని తెలిపారు.
Also Read: Pawan Kalyan: దళపతి ఒంటరి పోరు..ట్విస్ట్ ఎవరికో?
ప్రభుత్వ స్పందన
కోటవురట్ల మండలంలో విషాదంపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి నారా లోకేశ్, కోటవురట్ల ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతో ఫోన్‌లో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. ఘటనపై నివేదిక అందించాలంటూ అధికారులను ఆదేశించారు.
ఈ ప్రమాదంతో ఫార్మా పరిశ్రమల్లో భద్రతపై మరోసారి ప్రశ్నలు వచ్చాయి. పారావాడ ఫార్మాసిటీ వంటి పరిశ్రమలలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించడంపై సమగ్ర విచారణ అవసరం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.