Samudram: కృష్ణవంశీ దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా డి.వి.వి. దానయ్య నిర్మించిన ‘సముద్రం’ ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1999 అక్టోబర్ 22వ తేదీన విడుదలైన ఈ చిత్రం శతదినోత్సవం చూసింది. ఇందులో సాక్షి శివానంద్ నాయికగా నటించారు. కీలక పాత్రల్లో తనికెళ్ళ భరణి, రవితేజ, శ్రీహరి, ప్రకాశ్ రాజ్, ప్రత్యూష, సుధ కనిపించారు. ఇందులో రాశి ఓ ఐటెమ్ సాంగ్ లో చిందేసి కనువిందు చేసింది. చేయని నేరానికి హీరో కటకటాల వెనక్కి వెళతాడు. తరువాత అతనికి ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎందుర్కొంటూ తాను నిర్దోషి అని హీరో నిరూపించుకోవడం ఇందులోని కథ. దాదాపు ఇదే లైన్ తో జగపతిబాబు హీరోగానే గుణశేఖర్ తనదైన పంథాలో ‘మనోహరం’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా 2000లో విడుదలయింది. ‘సముద్రం’లో హీరోగా విజయం చూసిన జగపతిబాబు, ‘మనోహరం’తో ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్నారు. ‘సముద్రం’ చిత్రానికి శశిప్రీతమ్ సంగీతం ఆకట్టుకుంది.
