Kavitha

Kavitha: ‘జనసేన’ పుట్టలో వేలు పెట్టిన కవిత

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఓ మీడియా ఇంటర్వ్యూలో “అన్‌ఫార్చునేట్లీ హీ బికేం ఎ డిప్యూటీ సీఎం”, “హీ ఈజ్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్” అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయ ప్రస్థానాన్ని తక్కువ చేస్తూ, ఆయన వామపక్ష భావజాలం నుంచి హిందుత్వ రైటిజం వైపు మళ్లారని, ఆయన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసైనికులు, పవన్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కవితకు సరైన కౌంటర్ ఇచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా యుద్ధం ప్రకటించారు.

కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆమె గతాన్ని తెరపైకి తెస్తున్నారు జనసేన శ్రేణులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయిన వీడియోలను వైరల్ చేస్తూ… “సీరియస్ పొలిటీషియన్ అంటే స్కామ్‌లు చేసి జైలుకు వెళ్లడమా?” అని సెటైర్లు వేస్తున్నారు. “పవన్ కల్యాణ్ పదేళ్ల కష్టంతో ప్రజల మనసు గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు. కవిత మాత్రం వారసత్వంతో ఎమ్మెల్సీ అయ్యారు. ఆమెకు పవన్ స్థాయిని విమర్శించే అర్హత ఉందా?” అంటూ మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురిపిస్తూ, ఆమెను ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ జనసేన ఇన్‌ఛార్జ్ నేమురి శంకర్ గౌడ్ కవితకు గట్టి కౌంటర్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్‌తో తిహార్ జైలుకు వెళ్లిన కవిత పవన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్న శంకర్‌గౌడ్‌… పవన్ ప్రజల ప్రేమతో ఎదిగారనీ, కవితలా నామినేటెడ్ పదవులతో కాదనీ విమర్శించారు. మరోసారి పవన్ గురించి తప్పుగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు.

Also Read: Bharathi Salute to Babu: ఆవిరైపోయిన వైసీపీ ఉత్సాహం!

Kavitha: కవిత స్కాముల వల్లే తెలంగాణలో బీఆర్ఎస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారం కోల్పోయాయని విమర్శిస్తున్నారు జనసైనికులు. పవన్‌ను తక్కువ చేసి వార్తల్లో నిలవాలని కవిత చూస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. పొరుగు రాష్ట్ర నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయంగా మర్యాద అనిపించుకోవదని కామన్‌ నెటిజన్లు సైతం విరుచుకుపడుతున్నారు. పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పడం ఆమె అహంకారానికి నిదర్శనమంటూ న్యూట్రల్‌ వర్గాలు తమ అభిప్రాయాలను పోస్టుల రూపంలో పెడుతున్నారు. గతంలో వైసీపీ గెలుపుకు బీఆర్ఎస్ కష్టపడిందనీ… ఇప్పుడు పవన్‌ను టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణలో ప్రజాధరణ కోల్పోయిన బీఆర్ఎస్‌కు ఊతం ఇవ్వాలని కవిత చూస్తున్నారంటూ జనసేన క్యాడర్ ఆరోపిస్తోంది.

పవన్ కల్యాణ్ స్వయంకృషితో రాజకీయాల్లో డిప్యూటీ సీఎం స్థానం సంపాదించగా, కవిత వారసత్వంతో మాత్రమే ఎదిగారని జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు. తీహార్‌ జైలు నుంచి వచ్చిన కవితకు పవన్ స్థాయిని విమర్శించే హక్కు లేదని ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ రకంగా ఒకే ఒక్క వ్యాఖ్యతో జనసేన క్యాడర్ ఆగ్రహాన్ని రుచిచూస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *