Raghunandan Rao: హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన భూముల వివాదం రాజకీయ వేదికగా మారింది. ఈ విషయంపై బీజేపీ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. సుమారు 400 ఎకరాల భూముల అంశంలో బీఆర్ఎస్ నాయకులపై ఆయన ఆరోపణలు గుప్పించారు.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల వైఖరిని ఎండగడుతూ, “దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది,” అంటూ వ్యాఖ్యానించారు. గత పదేళ్లపాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ భూములపై స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కి చెందిన భూముల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందని ఆయన నిలదీశారు. “ఆ భూములను రికార్డుల్లో నమోదు చేయకుండా ఎందుకు వదిలేశారు?” అని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు మోసాల కన్నీళ్లు కారుస్తున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. విశ్వవిద్యాలయ భూములను రక్షించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ భూముల పరిరక్షణ కోసం తాము కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసామని, ఒక్క అంగుళం భూమి కూడా పోకుండా విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని హామీ ఇచ్చారు.