KTR: ఈ నెల (ఏప్రిల్) 27న వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తి వద్ద నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల గురించి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ రజతోత్సవ వార్షిక మహాసభ, బహిరంగ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లాల వారీగా ఆ పార్టీ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
KTR: ఈ నేపథ్యంలో కేటీఆర్ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై మంగళవారం చేసిన కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కాని ప్రాంతంలో సభ నిర్వహణ ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తోపాటు సభ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు.
KTR: తెలుగునాట విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాన పార్టీలు రెండే రెండు అని, అవి బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ అని కేటీఆర్ చెప్పారు. అందుకే ఏడాదిపాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను చేస్తామని తెలిపారు. ప్రతి నెలా ఒక్కో కార్యక్రమం చొప్పున 12 నెలలపాటు ఉత్సవాలు నిర్వహిస్తామని, ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తమ పార్టీ చరిత్రలోనే ఎల్కతుర్తిలో జరిగే సభ.. అతి పెద్దది కాబోతుందని తెలిపారు.
KTR: ఈ నెల 27వ తేదీన ఆదివారం కావడంతో విద్యార్థులకు సెలవులు ఉంటాయని, ఇతరులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులూ కలగబోవని కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ ద్వారా 3,000 బస్సుల కోసం ఆర్టీసీ సంస్థకు తాము విజ్ఞప్తి చేశామని, దానికి సంస్థ సూత్రప్రాయంగా అంగీకరించిందని చెప్పారు.
KTR: బహిరంగ సభ అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్థి సభ్యత్వాలను నమోదు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు అనంతరమే పార్టీ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర కమిటీలతోపాటు జిల్లా కమిటీలను, ఇతర కమిటీలను ఎన్నుకుంటామని పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
KTR: గతంలో తమ పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ఎల్కతుర్తి బహిరంగ సభకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, కోర్టు నుంచి అయినా అనుమతి పొందుతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.