Crime News: ఇటీవల కాలంలో తనను ప్రేమించలేదని, లేక పెళ్లికి తిరస్కరించారనే అక్కసుతో యువతులపై, వారి తల్లిదండ్రులపై ప్రేమాన్మాదిలు రెచ్చిపోతున్నారు.. మొన్న విశాఖ ఓ ఘటన చోటుచేసుకోగా.. తాజాగా మరో ఘటన కలకలం రేపింది.. ఇంట్లో ఎవరూ లేరని విషయాన్ని గమనించిన మొహానికి మంకీ క్యాప్ ధరించి.. ఇంట్లోకి ప్రవేశించి ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు ఆ ప్రేమన్మాది.. యువతి వంట గదిలో పనిచేసుకుంటున్న సమయంలో పొట్టపై రెండు చోట్ల బలంగా పొడిచి పరార్ అయ్యాడు..దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ నిందితుడి కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇటీవల విశాఖపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని యువతిపై, పెళ్లికి తిరస్కరించారనే అక్కసుతో ఆమె తల్లిపైనా పట్టపగలు ఇంటికెళ్లి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి వారం రోజులు కూడా గడువక ముందే రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది.
విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో కోండ్రు అఖిల అనే యువతిపై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఇంట్లో వాళ్లంతా పనికి వెళ్లిన సమయంలో, మొహానికి మంకీ క్యాప్ ధరించి యువతి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడు. యువతి వంట గదిలో పనిచేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చి పొట్టపై రెండు చోట్ల బలంగా పొడిచాడు.
Also Read: Hyderabad: గర్భవతి అయిన భార్యపై ఇటుకలతో దాడిచేసిన వ్యక్తి !
దాడి తర్వాత దుండగుడు ఇంటి వెనుక తలుపు నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు గ్రామస్తులు వెంటబడినప్పటికీ అతడు చిక్కకుండా పారిపోయాడు. తీవ్ర గాయాలతో పడిపోయి ఉన్న అఖిలను ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చిపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న మెడికోవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలు అఖిలను దుండగుడు రెండు సార్లు కత్తితో పొడిచినట్టు ఆయన వెల్లడించారు. వంట గదిలో వంట చేస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం అఖిల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటోందని వివరించారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వకుల్ జిందాల్ వివరించారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ల సహకారంతో దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించారు.
త్వరలోనే కేసును ఛేదిస్తామని, నిందితుడిని చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు. మరిన్ని వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక చెబుతామన్నారు. ఇది ప్రేమోన్మాది దాడి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలేఖ్య బంధువు ఒకరు మాట్లాడుతూ, యువతి అమ్మానాన్న, తాము పనికి వెళ్లామని చెప్పారు. చుట్టుపక్కల వారు ఫోన్చేబితే విషయం తెలిసిందన్నారు. ప్రేమవ్యవహారాలు ఏమీలేవని తెలిపారు. కాగా, బాధిత యువతి అఖిలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు.