Hyderabad: ఇద్దరు ప్రేమించుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు..నగరంలో కాపురం పెట్టి పనులు చేసుకుంటూ హ్యాపీగా జీవనం సాగించారు..ఆమెకు ఇప్పుడు రెండు నెలల గర్భిణీ కూడా..ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరింది.. వైద్యం అనంతరం డిశ్చార్జ్ అయింది.. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ, భర్తకు ఏమి అయిందో ఏమో తెలియదు.. ఒక్కసారిగా గర్భిణీ అనీ చూడకుండా భర్త దాడికి తెగబడ్డారు.. పాపం కడుపుతో ఉన్న ఆ యువతి ఏం చేస్తుంది.. తిరిగి దాడి చేయలేదు కదా..? ఆ తల్లి చనిపోయిందని అనుకోని అక్కడ నుంచి భార్యను వదిలి పరార్ అయ్యాడు.. చివరకు ఏం అయిందో తెలుసా..?
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గర్భవతి అయిన భార్యపై, భర్త బండరాయితో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైన మహిళ చావుబ్రతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గచ్చిబౌలి ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం, వికారాబాద్‌కు చెందిన ఎండి.బస్రత్ బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి హఫీజ్ పేట్‌లోని ఆదిత్యనగర్‌లో ఉంటూ ఇంటీరియర్ పనులు చేస్తుంటాడు. 2023 జనవరిలో అజ్‌మేర్ దర్గాకు వెళ్లిన సమయంలో బస్సు ప్రయాణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన షబానా పర్వీన్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2024 అక్టోబర్‌లో కోల్‌కతాకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకొని హఫీజ్‌పేటకు తీసుకొచ్చాడు.
Also Read: Crime News: మైనర్ బాలికను కిడ్నప్ చేసి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు .
ప్రస్తుతం షబానా పర్వీన్ రెండు నెలల గర్భిణి. మార్చి 29న షబానాకు వాంతులు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల చికిత్స అనంతరం ఏప్రిల్ 1న రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి బయటకు రాగానే భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
మాటామాటా పెరగడంతో బస్రత్ ఒక్కసారిగా షబానాపై దాడికి తెగబడ్డాడు. ఒక్కసారిగా ఆమె దగ్గరకు పరిగెత్తి కాలితో తన్నాడు. నడిరోడ్డుపై పెనుగులాటలో కిందపడిన భార్యపై అక్కడే ఉన్న బండరాయితో పదేపదే దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన షబానా అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె చనిపోయిందని భావించిన బస్రత్ అక్కడి నుంచి పారిపోయాడు.
విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కొన ఊపిరితో ఉన్న షబానాను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిన ఆమె ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు బస్రత్ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.