Gachibowli Galata: కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో చిక్కుకుంది తెలంగాణ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి సర్కార్ విపక్షాల ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోవడంలోనే కాదు, కోర్టులకు నిజాలు చెప్పడంలోనూ ఘోరంగా విఫలమైందన్న మాటలు వినిపిస్తున్నాయ్. ఫేక్ ఫోటోలు, ఏఐ వీడియోలతో విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తుంటే, ఆ భూమి అటవీ శాఖదా, హెచ్సీయూదా అన్న గందరగోళాన్ని కూడా సరిచేయలేకపోయారు. సుప్రీం కోర్టు దీన్ని అటవీ భూమిగా భావించింది, కానీ అది 2003లో వాణిజ్య అవసరాల కోసం కేటాయించిన స్థలమని ప్రభుత్వం రుజువు చేయలేకపోయింది.
ఈ భూమిని 2003లో ఐఎంజీ-భరత సంస్థకు కేటాయించారు. అప్పట్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ రావాల్సింది, కానీ వైఎస్ ప్రభుత్వం బహుషా వాటాల కోసం వేధించడం వల్లేమో తెలీదు కానీ.. మొత్తానికి కేసుల్లో చిక్కుకుంది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంతో చిన్న చిన్న చెట్లు, పొదలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. విపక్షాలు ఇదే అమెజాన్ ఫారెస్ట్ అన్నంతలా చిత్రీకరించి, అడవుల్ని నాశనం చేసేస్తున్నారంటూ ప్రచారం చేశాయి. ఈ హడావుడిలో సుప్రీం కోర్టు కూడా అది అటవీ భూమని భావించింది. కానీ చుట్టూ ఆకాశ హర్మ్యాల వంటి కాంక్రీట్ బిల్డింగులు ఉంటే.. వాటి మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వన్యప్రాణులు ఎక్కడి నుండి వస్తాయి? ఎలా వస్తాయన్న కామన్ క్వశ్చన్ని కూడా రైజ్ చేయలేకపోయింది కాంగ్రెస్ సర్కార్.
Also Read: Gold Stolen: బురఖాలు ధరించి వచ్చారు.. కోటిరూపాయల బంగారం కొట్టేశారు!
Gachibowli Galata: మొదట హెచ్సీయూ భూములన్నారు, తర్వాత అటవీ భూమన్నారు. విపక్షాల లక్ష్యం – ఈ భూముల్ని అమ్మకుండా చేయడం. దాదాపు అది సాధించారు. చుట్టూ కొండలు, గుట్టలు కొట్టి, అమ్మిన ప్రదేశాల్లో ఆకాశహర్మ్యాలు వచ్చాయి. అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ఈ భూమి మాత్రం మళ్లీ కేసుల్లో చిక్కుకుంది. 30 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న భూములు మళ్లీ ఎన్నేళ్లు నిరుపయోగంగా మిగులుతాయో ఎవ్వరికీ తెలీదు. రేవంత్ సర్కార్ నిజాలు చెప్పలేక, ఫేక్ ప్రచారాన్ని ఎదుర్కోలేక చేతులెత్తేయడం వల్లే.. విపక్షాలు ఈ గందరగోళాన్ని సద్వినియోగం చేసుకుని, భూముల అమ్మకాన్ని అడ్డుకున్నాయన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ గచ్చిబౌలి గలాటా మరింత ముదిరింది. ఎప్పటికి పరిష్కారం లభిస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి!

