Crime News: నల్లగొండ జిల్లాకు చెందిన గురుకుల విద్యార్థిని రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నంలోని ఓ మార్ట్ సిబ్బంది ఓ చిన్నకారణంతో తమ ప్రతాపం చూపారు. ఆ మార్ట్‌కు ఆనందంగా వచ్చిన ఆ బాలుడు చిన్న చాక్‌లెట్ దొంగిలించాడని నెపం నెట్టి నిర్బంధించి, విచక్షణారహితంగా కొట్టారు. ఈ విషయం తెలిసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారి చెర నుంచి ఆ బాలుడు బయటపడ్డాడు.
Crime News: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం తిప్పలమడుగు గ్రామానికి చెందిన బాలుడు (14).. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇబ్రహీంపట్నంలోని ఓ మార్ట్‌కు వెళ్లాడు. ఆ దుకాణంలో కలియదిరిగాడు. ఏమి కొనుక్కోవాలనుకున్నాడో ఏమో కానీ, ఇంతలోనే ఆ మార్ట్‌లో ఓ చాక్లెట్ దొంగలించాడని ఆ బాలుడిపై సిబ్బంది విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా ఆ బాలుడిని కొట్టారు.
Crime News: ఆ మార్ట్ భవనం సెల్లార్‌లోని ఓ గదిలో ఆ బాలుడిని నిర్బంధించారు. నలుగురు సిబ్బంది ఆ బాలుడి నోట్లో ఉప్పు కుక్కి, పైపుతో తీవ్రంగా కొడుతూ చిత్రవధ చేశారు. ఆ చిత్రహింసలను భరించలేని ఆ బాలుడు గట్టిగా కేకలు వేశాడు. దీంతో స్థానికులకు ఆ బాలుడి కేకలు వినబడ్డాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని వారి చెర నుంచి విడిపించారు.
Crime News: చికిత్స నిమిత్తం ఆ బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. చాక్లెట్ దొంగిలించాడన్న చిన్న కారణంతో ఆ బాలుడిని చిత్రవధకు గురి చేయడంపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆ బాలుడిపై దాడికి పాల్పడిన సిబ్బంది, యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు మానవతావాదులు కోరుతున్నారు. బాలల హక్కుల చట్టంపై వారిపై కేసు నమోదు చేయాలని కోరుతున్నారు.

