Kingston OTT: జీవీ ప్రకాష్ కుమార్ నటించిన ‘కింగ్‌స్టన్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్ర ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ శైలిలో రూపొందిన ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. తెలుగుతోపాటు ఇతర భాషల్లో డబ్ అయిన ఈ చిత్రం తొలి షో నుంచే మిశ్రమ స్పందన పొందింది. కమల్ ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యభారతి కథానాయికగా, సాబుమాన్ అబ్దుసమద్, అజగన్ పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వినూత్న కథాంశంతో రూపొందిన ‘కింగ్‌స్టన్’ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అయితే, ఈ విషయంపై నిర్మాతలు లేదా ZEE5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జీవీ ప్రకాష్ ఈ చిత్రంలో హీరోగా మాత్రమే కాక, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. థియేటర్లలో అంతగా మెప్పించని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.
