Karimnagar

Karimnagar: నీటి కోసం.. మాటల యుద్దం

Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాగు నీరందక పలు ప్రాంతాల్లో వరిపొలాలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం పరిధి నుంచే కాకతీయ కెనాల్, దాని ఉప కాలువలు వెళుతున్నప్పటికీ.. పొలాలు ఎండిపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది. పదిహేను నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు సాగునీరందక కన్నీరు పెడుతున్నారన్నారు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు నీరందాల్సి ఉండగా, ఎగువన ఉన్న మంథని, పెద్దపల్లి, ధర్మపురి నియోజకవర్గాలకు నీరు తీసుకుపోతున్నారని ఫైర్‌ అయ్యారు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌కు నిబంధనల ప్రకారం నీరు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. కాకతీయ కాలువ 116 క్రాస్ జంక్షన్‌ సాగునీటి సరఫరాలో సమన్యాయం పాటించకపోతే ఊరుకునేది లేదన్నారు. ఈ జంక్షన్‌ వద్ద అధికారులు సమన్వయం పాటించకపోవటం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలానికి డీ89 కాలువ ద్వారా వారబందీ ప్రకారం రావాల్సిన వాటా సాగునీరు రాకపోతే రెగ్యులేటర్‌ గేట్లను ఎత్తివేస్తామని, అవసరమైతే పగులకొడుతామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు.

Karimnagar: అయితే అధికార హస్తం నేతలు మాత్రం గంగుల మాటలను కొట్టి పారేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలానికి నీరు ఆగిపోలేదని, సరిగ్గా రాని మాట వాస్తవమేనని అన్నారు. అదే విషయమై ఇంచార్జీ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డితో మాట్లాడి నీటిని విడుదల చేయించామని, కాలువల వద్దకు వెళితే నీరు వస్తుందో లేదో గంగుల కమలాకర్‌కు తెలుస్తుందని కౌంటర్‌ ఇచ్చారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గంగులను తీవ్రంగా తప్పుపట్టారు. గత పదహారేళ్లుగా కరీంనగర్‌కు గంగుల కమలాకరే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసి గంగుల నియోజకవర్గంలో కాలువలను పట్టించుకోకపోవడం వల్లనే చివరివరకు నీరందడం లేదని విమర్శించారు.

Also Read: Ts Minister Race: ఉగాదికి తీపి కబురు ఎవరికి?

Karimnagar: ఎస్పారెస్పీ కట్టినప్పటి కాలువలను గంగుల తన దశాబ్దంన్నర పాలనలో ఎందుకు రిపేర్ చేయించలేదో, ఎందుకు పూడిక తీయించలేదో చెప్పాలన్నారు. మొత్తానికి గేట్లు బద్దలు కొడతామని ఎమ్మెల్యే అంటే.. కాలువల వద్దకు వెళ్లి చూడండి అని అధికార పార్టీ నేతలంటున్నారు. మరోవైపు ఇంకో రెండు తడుల నీరు అందితే తప్ప పంటలు చేతికొచ్చే అవకాశాలు లేవని, వెంటనే నీరందించే ప్రయత్నాలు చేయాలని రైతులంటున్నారు.

ఏదేమైనా సాగునీటి కోసం అధికార ప్రతిపక్ష నేతలు మాటలతో యుద్ధానికి దిగుతుంటే.. అసలు తాగునీటికే ఎద్దడి వచ్చే అవకాశాలు మరోవైపు కనిపిస్తున్నాయి. ఎల్ఎండి ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకు తగ్గిపోతోంది. నడి వేసవి కాలంలో కరీంనగర్ పట్టణానికి తాగునీరు అందే అవకాశాలు కనిపించడం లేదు. ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెట్టి… సాగు, తాగునీరు పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *