hyderabad : తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల వ్యవహారం మరోసారి హైకోర్టుకు వెళ్లింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారు, పరీక్షల వాల్యుయేషన్ సరిగా జరగలేదని ఆరోపించారు. 18 పేపర్ల వాల్యుయేషన్ కేవలం 12 నిపుణులతోనే జరిగిందని, 3 భాషల్లో పరీక్షలు జరిగినా సరైన నిపుణులతో వాల్యుయేషన్ చేయించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ముఖ్యంగా, తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పారు.
తెలుగు, ఇంగ్లీషు మీడియం పేపర్ల వాల్యుయేషన్ ఒక్క నిపుణితోనే చేయడం వల్ల నాణ్యతలో లోపం ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్ వాదనలు విన్న తర్వాత హైకోర్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుండి 27 వరకు జరిగాయి. ఈ పరీక్షల ప్రొవిజనల్ మార్కుల జాబితాను మార్చి 10న విడుదల చేసింది.