Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టనుంది. ఇప్పటికే పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణను ప్రారంభించారు.
సిట్ డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను విచారించనున్నారు. వివేకా హత్య అనంతరం శ్రీనివాసులు రెడ్డి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఆయన మరణం తర్వాత, వరుసగా కువైట్ గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైయస్ అభిషేక్ రెడ్డి, రంగన్న మృతి చెందారు. దీంతో ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్న సాక్షుల మరణాలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో విచారణ
ఇదిలా ఉండగా, వివేకా కుమార్తె వైఎస్ సునీత ఈ కేసు విచారణపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులతో పాటు, సీబీఐని కూడా ప్రతివాదులుగా చేర్చారు. విచారణ సందర్భంగా, 2019 మార్చి 14న జరిగిన హత్యపై ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైన పురోగతి లేదని సునీత న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రథమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి విచారణ సీబీఐకి మారినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం కనబడలేదని ఆయన పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ కేసు ముగిసినట్టే.. క్లోజర్ రిపోర్ట్‌ను దాఖలు చేసిన CBI
హైకోర్టు చర్యలు
ఈ కేసులో నిందితులందరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంతకుముందు, తెలంగాణ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసి, కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మరో నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు సమాచారం.