Telangana News:తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సన్నబియ్యం పంపిణీ గడువు రానే వచ్చింది. ఏప్రిల్ నెల నుంచి ఇక రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌కార్డుల లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. గత కొన్నాళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఈ పథకానికి ఉగాది పర్వదినాన సర్కారు శ్రీకారం చుట్టనున్నది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఇక నుంచి సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. దొడ్డురకం బియ్యాన్ని ఎక్కువ మంది పేదలు తినకపోవడం, ఆ బియ్యం పక్కదారి పడుతుండటంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి ముందుకొచ్చింది.
Telangana News:సన్నరకం బియ్యం పంపిణీతో పేదలకు చేరువ కావచ్చనే ఆలోయన కూడా కాంగ్రెస్ సర్కార్ చేసిందని విశ్లేషకులు చెప్తుంటారు. ఏదైమనా సన్నరకం బియ్యం అందజేసే కార్యక్రమం బృహత్తరమైనదని అభివర్ణిస్తున్నారు. సన్నబియ్యం పంపిణీ చేయాలనే సదుద్దేశంతోనే సర్కారు గత వానకాలంలో రైతులకు సన్నరకం వడ్లకు బోనస్ సైతం ప్రకటించింది. దీంతో ఈ మేరకు వచ్చే ఏప్రిల్ నుంచి సన్నరకం బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది.
Telangana News:ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉగాది పర్వదినాన లాంఛనంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. నియోజకవర్గంలోని మఠంపల్లి ఆలయంలో పంచాంగ శ్రవణం విని ఆతర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా కార్యక్రమం ప్రకటించకపోయినా, ఇదే వేదిక అవుతుందని సమాచారం. ఏప్రిల్ 1 నుంచి రేషన్ దుకాణాల్లో దొడ్డురకం బియ్యానికి బదులు సన్నరకం బియ్యాన్ని పంపిణీ చేస్తారు.
Telangana News:రేషన్‌కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కొక్కరికీ 6 కిలోల సన్నరకం బియ్యం పంపిణీ చేస్తారని సమాచారం. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 91,19,268 కుటుంబాలకు, 2,82,77,859 మందికి లబ్ధి చేకూరనున్నది. ఈ మేరకు ఇప్పటికే గోదాముల్లో 8 లక్షల టన్నుల సన్నరకం బియ్యాన్ని సిద్ధంగా ఉంచినట్టు తెలుస్తున్నది.
Telangana News:సన్నరకం బియ్యం పంపిణీకి ఏడాదికి దాదాపు 23 నుంచి 25 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఇందుకోసం వానకాలం సీజన్‌లో ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్నవడ్లను సేకరించినట్లు సమాచారం. ఈ మేరకు ఆ ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ద్వారా బియ్యంగా మార్చే పనిలో ఉన్నట్టు తెలుస్తున్నది. రాబోయే రోజుల్లో 16 నుంచి 16 లక్షల టన్నుల సన్నబియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. ఒకవేళ ఈ ఏడాది చివరికల్లా సన్నబియ్యం తక్కువైతే యాసంగిలో మరో 6 నుంచి 8 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించే పనిలో పౌరసరఫరాల శాఖ ఉన్నట్టు తెలుస్తున్నది.