Minor Gang Rape: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికను బంధించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. చివరకు విజయవాడలో బాలికను వదిలేయడంతో ఓ ఆటో డ్రైవర్ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి కూడా ఉన్నట్టు గుర్తించారు.
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక, ఆమె ఇంటి పక్కన ఉండే యువతితో కలిసి మార్చి 9న గన్నవరం మండలం వీరపనేని గూడెం వచ్చింది. ఈ క్రమంలో వీరపనేని గూడెంలోని యువతి ఇంట్లో గొడవలు జరిగాయి. గొడవకు బాధిత బాలిక కారణమంటూ యువతి తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక మార్చి 13న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.
వీరపనేని గూడెం ఊరి బయట మద్యం సేవిస్తున్న మైనర్ బాలుడు, రజాక్ అనే యువకుడు ఆమెతో మాటలు కలిపాడు. ఆమె గురించి తెలుసుకుని జి. కొండూరులో మీ ఇంటికి తీసుకు వెళ్తానని నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఆమెను ఎక్కించుకుని కొంత దూరం తీసుకు వెళ్లి అత్యాచారం చేశారు.
Also Read: Crime News: భర్తను చంపి.. ప్రియుడితో హనీమూన్ కి వెళ్లిన భార్య
ఆ తర్వాత ఆమెను జి.కొండూరు తీసుకువెళ్లకుండా అదే గ్రామానికి చెందిన సిద్ధు, జితేంద్ర వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను కేసరపల్లికి చెందిన అనిల్, హర్షవర్ధన్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ వారు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. చివరకు ఆమెను మార్చి 17వ తేదీ రాత్రి ఆటోలో విజయవాడ మాచవరం తీసుకొచ్చి వదిలేశారు.
బాలిక తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆత్కూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్త ముమ్మరం చేసి బాలికను అపహరించిన వారిని గుర్తించారు. కొందరిని అదుపు లోకి తీసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పలు మార్లు ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు.
బాలికను నిర్బంధించిన ప్రదేశాలను కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేసరపల్లిలోనే నాలుగు రోజుల పాటు బాలికను బంధించి ఉంచారని, బాలిక కోసం గాలిస్తున్నట్టు తెలియడంతో విజయవాడలో వదిలేసినట్టు దర్యాప్తులో గుర్తించారు. బాలికను తల్లి సమక్షంలో విచారించడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.

