Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, మంద కృష్ణ మాదిగ తనకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువగా విశ్వసిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించిందని తెలిపారు. గతంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో, ప్రభుత్వం బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించిందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదని విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్ణయం
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎస్సీలకు న్యాయం చేయాలని గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందరితో సమన్వయం చేసుకుని, శాసనసభలో ఏకాభిప్రాయం సాధించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకించే సాహసం ఎవరూ చేయలేదని సీఎం అన్నారు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో తాను ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని సూచించానని రేవంత్ గుర్తు చేశారు. కేంద్రానికి తీర్మానం పంపించాలని కోరినా, అప్పటి ప్రభుత్వం ఆలస్యం చేసిందని విమర్శించారు. తాము తీర్మానం ప్రవేశపెడితే, తనతో పాటు సండ్ర వెంకటవీరయ్య, సంపత్‌లను సభ నుండి బహిష్కరించారని తెలిపారు. చివరికి తాము తీసుకొచ్చిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అప్పటి ప్రభుత్వం చెప్పి, చివరకు తీసుకెళ్లలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. పిల్లలను కోచింగ్‌లకు సిద్ధం చేయాలని, మంచి విద్య అందించాలని సూచించారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విదేశాలకు పంపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిల్లలు ఎల్లప్పుడూ ఊరిలోనే కాకుండా, విదేశాలకు వెళ్లి మెరుగైన అవకాశాలు పొందాలని సూచించారు.

