Pawan Kalyan-Botsa: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య సరదా సంభాషణ జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గ్రూప్ ఫోటో సెషన్ ముగిసిన తర్వాత బొత్స పవన్‌ను ప్రత్యేకంగా కలిశారు.
సభ్యుల మధ్య తరచూ అధికార, విపక్ష తేడా లేకుండా సరదా సంభాషణలు జరగడం సాధారణమే. సభలో ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునే నేతలు, బయట మాత్రం కొంత ముచ్చటించుకుంటారు. అలాంటి సంఘటనే ఈసారి ఏపీ అసెంబ్లీలో కనిపించింది. పవన్ కళ్యాణ్, బొత్స సత్యనారాయణలు అసెంబ్లీ ప్రాంగణంలో ముచ్చటించుకుంటూ కొల్లేరు సమస్యపై కూడా చర్చించారు.
ఫోటో సెషన్ అనంతరం బొత్స, పవన్‌ను పలకరించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఢిల్లీ నుంచి తిరిగి ఎప్పుడు సభకు వస్తారో ప్రశ్నించారు. దీనిపై స్పందించిన పవన్ త్వరలోనే హాజరవుతానని సమాధానం ఇచ్చారు. ఇదే సందర్భంలో కొల్లేరు ప్రాంత రైతుల సమస్యలను బొత్స ప్రస్తావించారు.
Also Read: Delhi: కుంభమేళాపై పార్లమెంట్‌లో చర్చకు విపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రియాంకా గాంధీ డిమాండ్..
Pawan Kalyan-Botsa: కొల్లేరు సరస్సు పరిసరాల్లో అటవీ శాఖ నిర్వహిస్తున్న సర్వే వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాలతో సర్వే జరుగుతోందని బొత్స వివరించారు. రైతుల ప్రతినిధుల బృందం పవన్‌ను కలవాలని కోరుతున్నారని, అందుకు సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్, ఢిల్లీ నుంచి రాగానే తగిన సమయం కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఆసక్తికర సంభాషణ తర్వాత ఇద్దరు నేతలు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. అసెంబ్లీలో రాజకీయ విభేదాలు ఉన్నా, వ్యక్తిగతంగా నేతల మధ్య సౌహార్దత కొనసాగుతుందని ఈ సంఘటన మరోసారి రుజువుచేసింది.