Sunita Williams: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తొమ్మిది నెలల అనంతరం ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. వీరి ప్రయాణం ప్రారంభమవగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి వీరిని భూమికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌక అనుసంధానమైంది. ఆ తర్వాత, వ్యోమనౌక ISS నుంచి విడిపోయి భూమి దిశగా సాగింది.
NASA ఈ అన్‌డాకింగ్ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ISSలోని శాస్త్రవేత్తలు వ్యోమనౌక కక్ష్య మార్గాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ప్రయాణానికి ముందు, వ్యోమగాములు తమ సామాను సర్దుకుని క్రూ డ్రాగన్‌లో స్థానం సంపాదించారు. అంతరిక్ష కేంద్రాన్ని విడిచిపెట్టే ముందు, ISSలోని ఇతర వ్యోమగాములతో కలిసి వీరు ఫొటోలు తీసుకుంటూ ఆనందకరమైన క్షణాలను గడిపారు.
భారత కాలమానం ప్రకారం, మంగళవారం ఉదయం 8:15 గంటలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ పూర్తయింది. అనంతరం 10:15 గంటలకు అన్‌డాకింగ్ ప్రారంభమైంది, ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ ISS నుంచి విడిపోయింది. భూవాతావరణంలోకి ప్రవేశించడానికి బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకు ఇంజిన్ ప్రజ్వలనను చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత, 3:27 గంటలకు వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో దిగనుంది. సహాయ బృందాలు వెంటనే రంగంలోకి దిగి క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి.
Also Read: Bank Holidays: బ్యాంకులో పని ఉందా.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సెలవులు.. ప్లాన్ చేసుకోండి
Sunita Williams: 2024 జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’ ద్వారా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమికి తిరిగి రావాల్సి ఉంది. కానీ, ‘స్టార్‌లైనర్’లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఇప్పుడే స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ సహాయంతో వీరి భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది.