Car Prices Hike: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వాహన కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 2025 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు సంస్థ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉత్పత్తి వ్యయాలు పెరగడం, ఇతర ఆర్థిక ప్రభావాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ధరల పెంపు ప్రతి మోడల్‌కు భిన్నంగా ఉంటుందని తెలిపింది.
ఫిబ్రవరి 2025లో మారుతి సుజుకి 199,400 యూనిట్ల వాహనాలను విక్రయించింది, గత సంవత్సరం ఇదే కాలంలో 197,471 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇది 0.97% స్వల్ప వృద్ధిని సూచిస్తోంది. దేశీయంగా 163,501 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇతర OEM (Original Equipment Manufacturer) లకు 10,878 యూనిట్లు సరఫరా కాగా, 25,021 యూనిట్ల వాహనాలు ఎగుమతి అయ్యాయి. అయితే, ఎగుమతుల్లో 13.5% తగ్గుదల నమోదైంది.
గత ఒక నెలలో మారుతి సుజుకి షేర్లు 9% పడిపోయాయి, ఆరు నెలల వ్యవధిలో 5.2% నష్టపోయాయి. ఒక సంవత్సరం కాలంలో 1% స్వల్ప పెరుగుదల నమోదైంది. అయితే, రెండు సంవత్సరాలలో 40% ర్యాలీ సాధించగా, ఐదు సంవత్సరాలలో 107% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది.
Car Prices Hike: కస్టమర్లపై భారం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల వల్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని మారుతి సుజుకి తెలిపింది. ఈ నిర్ణయం ఇతర కార్ల తయారీ సంస్థలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
వచ్చే నెల నుంచి మారుతి వాహనాల ధరలు పెరుగుతుండటంతో కస్టమర్లు ముందుగా కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇదే ధోరణి కొనసాగితే ఇతర ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.