Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి నారాయణ, డూండీ రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అలాగే, స్మారక పార్కు నిర్మించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఆయన స్వగ్రామం అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. అక్కడ మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు, ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తాం, అని తెలిపారు.
పీ-4 విధానం ప్రారంభం
ఈ ఉగాది నుంచి రాష్ట్రంలో కొత్త పీ-4 విధానాన్ని అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. “ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తున్నాం. ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరూ కనీసం 10 మంది తెలుగువారిని పైకి తీసుకురావడానికి కృషి చేయాలి అని ఆయన సూచించారు.
సంవత్సరపాటు జయంతి ఉత్సవాలు
రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి 16 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతాయని సీఎం వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధిలో పొట్టి శ్రీరాములు సిద్ధాంతాలు మార్గదర్శకంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. ఆయన ఆశయాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

