Osmania University:

Osmania University: ఉస్మానియాలో ఇక ఉద్య‌మాలు బంద్‌.. నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై నిషేధం

Osmania University: తొలి నుంచి ఉద్య‌మాల వేదిక అయిన ఉస్మానియా యూనిర్సిటీలో నిర‌స‌నలు వినిపించ‌బోవు. ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు క‌నిపించ‌వు. ధ‌ర్నాల‌కు ఆస్కార‌మే ఉండ‌దు. యూనివ‌ర్సిటీ ప‌రిధిలో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, ధ‌ర్నాల‌పై నిషేధం విధించారు. ఈ మేర‌కు ఎలాంటి నిర‌స‌న‌లను అనుమ‌తించ‌బోమంటూ ఏకంగా ఓయూ ఉన్న‌తాధికారులు ఉత్త‌ర్వుల‌నే జారీ చేశారు. ఎక్క‌డా నిషేధాజ్ఞ‌లు ఉన్నా, ఉస్మానియాలో స్వేచ్ఛ‌గా ఆందోళ‌నలకు దిగిన విద్యార్థిలోకం గొంతులు ఇక నుంచి మూగ‌బోనున్నాయి.

Osmania University: ఉస్మానియా యూనివ‌ర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెస‌ర్ న‌రేశ్‌రెడ్డి జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో ఉద్య‌మాల‌కు ఇక చుక్కెదురైన‌ట్టే. ఉస్మానియా యూనివ‌ర్సిటీ, వివిధ‌ విభాగాలు, క‌ళాశాల‌లు, వివిధ ప‌రిశోధ‌నా, ఇత‌ర‌ కేంద్రాలు, ప‌రిపాల‌నా భ‌వ‌నాల్లో ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లను నిషేధిస్తూ ఆ స‌ర్క్యుల‌ర్ జారీ చేశారు. ఇలా కార్య‌క్ర‌మాలు వ‌ర్సిటీ ప‌నితీరుపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని, ప‌రిపాల‌నా, విద్య పురోగ‌తిని జాప్యం చేసే అవ‌కాశం ఉన్నందున ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. కొన్ని సంద‌ర్భాల్లో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని తెలిపారు.

Osmania University: యూనివ‌ర్సిటీలో శాంతియుత వాతావ‌ర‌ణంలో త‌ర‌గ‌తులు, ఇత‌ర కార్యక‌లాపాలు జ‌ర‌గాల‌ని పాల‌క‌వ‌ర్గం ఆకాక్షించింది. విద్యార్థి సంఘాలు వ‌ర్సిటీలోకి ప్ర‌వేశించి నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు, ధ‌ర్నాలు చేయ‌డంతో ప‌రిపాల‌నా ప‌నుల‌కు ఆటంకం క‌లుగుతున్న‌ద‌ని ఆ స‌ర్క్యుల‌ర్‌లో పేర్కొన్నారు. ప‌రిపాల‌నా అధికారులు, సిబ్బంది అధికారిక విధుల‌కు ఆటంకం క‌లిగిస్తున్నారని తెలిపారు. అనుమ‌తులు లేకుండా ఆందోళ‌న‌ల‌కు దిగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Osmania University: ఉస్మానియా యూనివ‌ర్సిటీ పాల‌క‌వ‌ర్గం జారీచేసిన స‌ర్క్యుల‌ర్‌పై విద్యార్థి సంఘాల నేత‌లు, విద్యావేత్త‌లు అభ్యంత‌రాల‌ను వ్య‌క్తంచేస్తున్నారు. ఉద్యమాల‌పై ఉక్కుపాదం మోప‌డ‌మేన‌ని, విద్యార్థి, ఉద్యోగ సంఘాల హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మేన‌ని మండిప‌డుతున్నారు. శాంతియ‌తంగా నిర‌స‌న‌లు తెలుప‌డం ప్ర‌తిఒక్కరి ప్ర‌జాస్వామిక హ‌క్కు అని, దీనిని కాల‌రాస్తే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్య‌మాలు న‌డుస్తున్న స‌మ‌యంలో రాష్ట్ర‌మంతా పోలీసులు ఉక్క‌పాదం మోపినా, ఉస్మానియా యూనివ‌ర్సిటీలో నిషేధాజ్ఞ‌లు అమ‌లు చేయ‌లేద‌ని వారు గుర్తుచేస్తున్నారు. ఓయూ ఉన్న‌తాధికారుల ప‌ట్టుద‌ల‌తో ఉండ‌గా, విద్యార్థి, ఉద్యోగ సంఘాల అభ్యంత‌రాల న‌డుమ ఈ వివాదం ఎటు దారితీస్తుందో వేచి చూడాలి మ‌రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *