MANDALI LO AA NALUGURU: ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు మిత్రపక్షమైన సీపీఐ, అటు ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారినే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించడం ఉమ్మడి జిల్లాను వార్తల్లో నిలుపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ గతంలో దామరచర్ల జెడ్పీటీసీగా రెండు పర్యాయాలు గెలుపొందగా.. గడిచిన ఆరేళ్లుగా నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డికి వీర విధేయుడుగా పేరున్న శంకర్ నాయక్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ హై కమాండ్.
అదేవిధంగా ఎస్సీ కోటాలో గతంలో సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం నుండి రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి, స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి వరించింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా సహకారం అందిస్తున్న సీపీఐకి పొత్తు ధర్మంలో భాగంగా కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది. దీంతో నల్గొండ జిల్లా పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యాన్ని తమ అభ్యర్థిగా సీపీఐ ప్రకటించింది. ఆయనది మునుగోడు నియోజకవర్గం. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థి దాసోజు శ్రవణ్‌ది నకరేకల్లు నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడెం. ఇలా అన్ని పార్టీలు ప్రకటించిన నలుగురు అభ్యర్థులు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులే కావడం చర్చనీయాంశంగా మారింది.
MANDALI LO AA NALUGURU: జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థుల ఎంపికలో మాట నెగ్గించుకున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో ఒకే సామాజిక వర్గ పెత్తనం నడుస్తోందన్న విమర్శలకు కౌంటర్‌గా… ఎస్టీ లంబాడా సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్‌ను, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్‌ను ఎమ్మెల్సీలను చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన ఎమ్మెల్సీ స్థానానికి.. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎంపికయ్యారు. ఈయనది యాదవ సామాజికవర్గం. ఇక బీఆర్ఎస్ సైతం బీసీ సామాజిక వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌ను డిక్లేర్ చేయక తప్పలేదు. ఈ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి ఒక్కరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నందున ఆ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మరో మార్గం లేక శ్రవణ్‌ను ఎంపిక చేశారన్న చర్చ జరుగుతోంది.
Also Read: Pawan Kalyan: భాషా స్వేచ్ఛపై పవన్ కల్యాణ్ స్పష్టత
మొత్తానికి శాసన మండలిలో నల్గొండదే పైచేయిగా నిలిచింది. మండలిలో అత్యున్నతి స్థానమైన చైర్మన్ పదవిలో జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బీఆర్‌ఎస్‌కి చెందిన ఎంసీ కోటిరెడ్డి ఉన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నది ఆలేరు నియోజకవర్గం. ఇక వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పింగళి శ్రీపాల్ రెడ్డి గెలిచినా… ప్రస్తుత ఎమ్మెల్సీగా అలుగుబెల్లి నర్సిరెడ్డి కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం ఈ నెల 31న ముగియనుంది. నర్సిరెడ్డిది కూడా నల్గొండ జిల్లానే. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా మరో నలుగురు నల్లగొండ జిల్లా నుంచి మండలిలో అడుగుపెడుతున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండా జిల్లా నుండి మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారి సంఖ్య ఎనిమిదికి చేరనుంది.
MANDALI LO AA NALUGURU: ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా గెలుపొందగా… అందులో ఇద్దరు క్యాబినెట్ మంత్రులుగా కొనసాగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఒక ఎమ్మెల్యే ఉండగా.. శాసన మండలిలో నలుగురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా నలుగురు ఎమ్మెల్సీలు ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి శాసనసభ మరియు మండలిలో మొత్తం 20 మంది ప్రజా ప్రతినిధులు ఉండడం ఓ రికార్డు అని చెప్తున్నారు పరిశీలకులు.
