CM Revanth Reddy: తాను తప్పుగా మాట్లాడినట్టయితే క్షమాపణలు చెప్పడానికి వెనుకాడనని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. శనివారం (మార్చి 15) అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ గురించి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్, హరీశ్‌రావు కలిసి కేసీఆర్‌ను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారంటూ తెలిపారు. తాను కేసీఆర్‌ను అనలేదని తేల్చి చెప్పారు.
CM Revanth Reddy: ఇదే నెలలో రవీంద్ర భారతిలో ఉద్యోగ నియామకాల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. స్టేచర్ ఉందని భావిస్తే, స్ట్రెచర్ వస్తుంది.. ఆ తర్వాత మార్చురీకే వెళ్లాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ భగ్గుమన్నది. కేసీఆర్‌ను అన్నారని, ఇది భావ్యం కాదని, సీఎం రేవంత్ వైఖరిపై ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఏకంగా ఆ పార్టీ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు.
CM Revanth Reddy: ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చర్చకు తెరలేపారు. తాను కేసీఆర్‌ను అనలేదని, బీఆర్ఎస్ ను ఉద్దేశించి మాత్రమే అన్నానని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్లు అధికారంలో ఉండగా స్టేచర్ ఉండేదని, ప్రజలు ఓడిస్తే ప్రతిపక్షంలోకి వెళ్లి స్ట్రెచర్ మీదికి చేరిందని, అక్కడి నుంచి మార్చురీకి వెళ్తుందని తాను చెప్పానని రేవంత్‌రెడ్డి చెప్పారు. తాను కేసీఆర్ వందేళ్లు బతికి ఉండాలని, ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటానంటూ ఎద్దేవా చేశారు.