Balineni srinivas reddy: జనసేన పార్టీ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తన తండ్రి పేరును ఉపయోగించుకుని ముఖ్యమంత్రి అయ్యారని, అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం స్వశక్తితో ఎదిగిన నాయకుడని కొనియాడారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిన్న చిన్న కేసుల పేరుతో కొంతమందిని అరెస్టు చేస్తున్నారని, అయితే స్కాములు చేసి కోట్లకు కోట్లు సంపాదించిన వారిపై చర్యలు తీసుకోలేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను వైసీపీ నుంచి బయటకు వస్తారా లేదా అనే సందేహం చాలామందికి ఉన్నప్పటికీ, తనను జనసేనలోకి తీసుకురావడం నాగబాబు వల్లే జరిగిందని చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కల్యాణ్ తోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలు బయటపెడతానని బాలినేని స్పష్టం చేశారు.
“నాకు మంత్రి పదవి తొలగించినప్పుడు నేను బాధపడలేదు. కానీ జగన్ నా ఆస్తులను, నా వియ్యంకుడి ఆస్తులను లాక్కున్నారు. ఎవరు చేసిన పాపాలు వారికి తప్పవు, ఈ విషయం జగన్ గ్రహించాలి. జగన్ నా జీవితంలో చేసిన అన్యాయాన్ని చెప్పడానికి ఒక్కసారిగా సమయం సరిపోదు. మరోసారి ఈ విషయాన్ని విస్తృతంగా వివరిస్తా” అని బాలినేని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, భవిష్యత్తులో పవన్ కల్యాణ్ తో ఓ సినిమా నిర్మించాలని తన కోరికను కూడా ఈ సందర్భంగా వెల్లడించారు.