Lockup Death Case: పోలీసుల విచారణలో ఉన్న ఓ నిందితుడి మృతితో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు చెప్తుండగా, పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల చిత్రహింసలతో లాకప్‌డెత్ జరిగితే ఆసుపత్రికి తరలించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గల్ఫ్ ఏజెంట్ సంపత్ మృతితో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Lockup Death Case: పెద్దపల్లి జిల్లాకు చెందిన గల్ఫ్ ఏజెంట్ సంపత్‌ను విచారణ నిమిత్తం నిజామాబాద్ వన్‌టౌన్ పోలీసులు తీసుకొచ్చారు. విచారణ సమయంలో సంపత్ కుప్పకూలడంతో హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించామని, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన సంపత్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. వారి రోదనలు మిన్నంటాయి.
Lockup Death Case: పోలీసుల చిత్రహింసలు పెట్టడం వల్లే సంపత్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంపత్ మృతదేహంతో నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద బంధుమిత్రులతో కలిసి ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని భీష్మించుకొని కూర్చొని ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Lockup Death Case: ఇదిలా ఉండగా, గల్ఫ్ ఏజెంట్ అయిన సంపత్ కొందరిని దుబాయ్ దేశం పంపాడు. అక్కడ పనిలేకపోవడంతో వారంతా అష్టకష్టాలు పడి తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. దీంతో వారంతా సంపత్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ మేరకు విచారణ కోసం పోలీసులు అతడిని తీసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది.