Jammu Kashmir: పెళ్లి వేడుక కోసం వెళ్లి మిస్సయిన ముగ్గురు వ్యక్తులు.. మూడు రోజుల తర్వాత శవాలుగా మారడం జమ్మూకశ్మీర్లో తీవ్ర కలకలం రేపింది. మూడు రోజుల క్రితం జాడతెలియకుండా పోయిన ముగ్గురు కశ్మీర్ యువకులు శవాలై తేలారు. భద్రతా బలగాలు తీవ్ర గాలింపు చర్యలతో మూడు రోజుల తర్వాత ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కథువా జిల్లా బిల్లావార్ పర్వత ప్రాంతం దగ్గర మృతదేహాలను గుర్తించారు. మరణించిన వారిని మర్హూన్ నివాసితులు వరుణ్ సింగ్, యోగేష్ సింగ్, దర్శన్ సింగ్ గా గుర్తించారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ నెల మార్చి 5న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కథువా నుంచి బయలు దేరారు.. మర్హూన్ నుండి సురాగ్కు వివాహ ఊరేగింపులో పాల్గొనేందుకు వెళ్లిన అనంతరం వారి ఆచూకీ తెలియకుండా పోయింది. అయితే.. వీరిలో ఒకరు తాము కొండప్రాంతంలో దారితప్పామంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు.. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు.
మార్చి 6న మల్హార్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు ముగ్గురు తప్పిపోయినట్లు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు.. వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టింది. డీజీఐ అధికారితో సహా ఇద్దరు సీనియర్ అధికార్లు సైతం గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.
Also Read: Pranay Murder Case: ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు
ఈ క్రమంలోనే.. కథువా జిల్లా బిల్లావార్ పర్వత ప్రాంతంలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే.. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం కావడంతో టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ.. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు. ఈ క్రమంలో.. పోలీసు గాలింపు చర్యలతో మృతదేహాలు లభ్యం కాగా.. ప్రమాదం కారణంగానే మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోస్ట్మార్గం తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని జమ్మూకశ్మీర్ అధికారులు తెలిపారు.
అయితే.. వారి మరణానికి కారణాన్ని నిర్ధారించడానికి పోస్ట్మార్టం కోసం వైద్యుల బోర్డును ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ఘటనకు ఒక ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది.. కానీ పోలీసులు ఆ సంబంధాన్ని నిర్ధారించలేదు. పూర్తి దర్యాప్తు తర్వాతనే వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.